రైతు కష్ట పడితేనే ప్రపంచానికి తిండి..


Sat,September 8, 2018 01:25 AM

-మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి
వర్ని: రైతు కష్టపడితేనే ప్రపంచానికి తిండి దొరుకుతుందని, రైతు నాగలి పక్కకి పెడితే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని చందూర్‌లో శుక్రవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంత కోటీశ్వరుడైనా రైతు పండించే పంటనే తింటాడు.. కానీ, డబ్బు కట్టలను తినలేడని అన్నారు. రైతుల బాధలు, వ్యవసాయం గురించి తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ వారి మేలు కోరి రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. సాగుకు 24గంటల నాణ్యమైన విద్యుత్తు, భూరికార్డుల ప్రక్షాళన వంటి కార్యక్రమాలు రైతుల సంక్షేమం కోరి చేపట్టారని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్త్తోందన్నారు. గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇన్ని పథకాలు, కార్యక్రమాలు అమలు చేయలేదన్నారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే తెలంగాణలో వ్యవసాయ రంగంలో ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి రాష్ట్రంలోని 52లక్షల మంది చిన్న,సన్నకారు రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారన్నారు.

రాష్ట్రంలో కోటి యాభైలక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని , సాగులో కోటి ఎనిమిది లక్షల ఎకరాలు ఉందన్నారు. రాష్ట్రంలో 23లక్షల బోర్లు విద్యుత్ పై ఆధారపడి ఉండగా.. రూ.1500 కోట్లతో ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే విద్యుత్ కొనుగోలు చేసి దేశంలోనే 24గంటల కరెంటును ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని గర్వంగా చెప్పారు. భవిష్యత్తు తరాలను ఉద్దేశించే సీఎం కేసీఆర్ ప్రతీ పథకం ప్రవేశ పెడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయనున్నారన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.2271 ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిన గొప్ప ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 813మంది రైతుల చనిపోయారని, అందులో 561 మందికి 3రోజుల్లోనే రూ.5లక్షల చొప్పున బీమా పరిహారం చెక్కులు కుటుంబాలకు ప్రభుత్వం అందజేసిందన్నారు. డబుల్ బెడ్‌రూమ్‌లు ఇండ్లు ఒకేసారి అందరికీ ఇవ్వలేక పోవచ్చని, విడతల వారీగా రెవెన్యూ సిబ్బంది సర్వే చేపట్టి ప్రతీ పేదవారికి ప్రభుత్వం అందిస్తుందని భరోసానిచ్చారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ఇంటింటికీ శుద్ధ్దమైన తాగునీరు ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా అందిస్తోందని తెలిపారు. కల్యాణలక్ష్మి, అమ్మఒడి, పింఛన్లు, కమ్యూనిటీ భవనాలు, గొర్ల పంపకం, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు.

గ్రామ గ్రామాన అభివృద్ధి...
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. చందూర్‌లో శుక్రవారం ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి రూ.2.10 కోట్లతో పెద్ద వాగుపై నిర్మించిన బ్రిడ్జి, రూ.40లక్షలతో నిర్మించిన కబ్రస్తాన్, రూ.1.80కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.22లక్షలతో నిర్మించిన కోపరేటీవ్ బ్యాంక్ భవనం, రూ.12లక్షలతో నిర్మించిన హిందూ శ్మశాన వాటికలను మంత్రి పోచారం ప్రారంభించారు. రూ.25లక్షలతో నిర్మించనున్న షాదీఖానా నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, జడ్పీటీసీ గుత్ప విజయభాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారోజి గంగారం, ఏఎంసీ వైస్ చైర్మన్ అరికెల సాయిరెడ్డి, టీఆర్‌ఎస్ వర్ని, రుద్రూర్ మండలాల అధ్యక్షులు మేక వీర్రాజు, పత్తి లక్ష్మణ్, సొసైటీ చైర్మన్లు, నేమాని వీర్రాజు, చంద్రూ నాయక్, హన్మంత్ రెడ్డి, పత్తి రాము, ఎంపీటీసీ జ్యోతి సాయిలు, శేఖర్, నాయకులు పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవలో తరిస్తా...
చేతనైనన్ని రోజులు, ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. చందూర్, మోస్రా గ్రామాలను మండల కేంద్రాలుగా చేసేందుకు కృషి చేస్తానని, గ్రామస్తులెవరూ ఆందోళన చెంద వద్దని హామీ ఇచ్చారు. మోస్రా, చందూర్ గ్రామాల మండలాల ఏర్పాటు విషయాన్ని పలుమార్లు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ల్లానని, కచ్చితంగా మండలాలు ఏర్పాటు చేయిస్తానని భరోసానిచ్చారు.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...