మూసీ ఆయకట్టులో యాసంగి సందడి


Sat,December 14, 2019 12:34 AM

-సమాయత్తమవుతున్న రైతాంగం
-రేపటి నుంచి నీటి విడుదల
-మూడు తడులకు పుష్కలంగా నీరు
-అవకాశం ఉంటే 4వ విడుత
-త్వరలో తేదీల ఖరారు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు ఈనెల 15వ తేదీ నుంచి యాసంగి పంట సాగు కోసం అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. మూడు తడులు పూర్తిగా, ప్రాజెక్టులోని నీటి లభ్యతను బట్టి నాలుగవ విడతగా నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు కురవడంతో సెప్టెంబర్‌ చివరిలోపు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దురదృష్టవశాత్తు అక్టోబర్‌ మొదటి వారంలో ప్రాజెక్టు గేటు ఊడిపోయి ప్రాజెక్టులోని నీరంతా దిగువకు వృధాగా పోయింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్‌రెడ్డి దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తూ నూతన గేటు ఏర్పాటు చేయించారు. ఇదే సమయంలో అక్టోబర్‌లో ప్రాజెక్టు ఎగువన వర్షాలు కురవడంతో తిరిగి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా వచ్చింది. గేట్లు దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 645 (4.46 టీఎంసీలు) అడుగులుగా ఉన్న ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని 640(3.20 టీఎంసీలు) అడుగులకు తగ్గించారు. దీంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటి విడుదలపై రైతుల్లో సందిగ్ధం ఏర్పడింది.

అయితే రైతులకు ఇబ్బందులకు కలుగకుండా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. గతంలో డిసెంబర్‌ 18 నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేవారు. కానీ రైతుల ప్రయోజనం కోసం ఈసారి మూడురోజులు ముందుగానే నీటిని వదులుతున్నారు. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. యాభై ఆరేండ్లుగా ఏనాడూ ప్రాజెక్టును పట్టించుకోని గత ప్రభుత్వాల తీరుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మూసీకి కొత్త రూపును తీసుకువచ్చింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రాజెక్టుకు నూతన గేట్లు ఏర్పాటు చేసేందుకు రూ.18.77 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టుకు 20 నూతన గేట్లతో పాటు, ప్రాజెక్టు ఎర్త్‌డ్యాంపై 4 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డును నిర్మించారు. అంతేకాకుండా కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ కోసం రూ.65 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు ఈ పనులు సగం వరకు పూర్తయ్యాయి. నీటి విడుదల నేపధ్యంలో కాలువల ఆధునీకరణ పనులు ప్రస్తుతం నిలిపి వేశారు. ప్రాజెక్టులో నీరు ప్రస్తుతం 640(3.20 టీఎంసీలు) అడుగులుగా ఉంది.

నీటి విడుదల తేదీల ప్రతిపాదనలు
మొదటి విడత ఈనెల 15 నుంచి 20రోజులపాటు
15రోజుల విరామం తర్వాత, రెండవ విడత 15 రోజుల పాటు నీటి విడుదల
15 రోజుల విరామం తర్వాత, మూడోవిడత 15 రోజులపాటు నీటి విడుదల
15రోజుల విరామం తర్వాత, ప్రాజెక్టులో ఉన్న నీటి లభ్యత ఆధారంగా నాల్గోవిడత విడుదల చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే ఈ తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు.
సాగులోకి రానున్న భూములు
ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పరిధిలోని 42 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో 1963లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని నకిరేకల్‌, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 50 గ్రామాల్లో ఉన్న రైతులు మూసీ నీటి ద్వారా పంటలను సాగుచేస్తారు. ప్రారంభంలో కొన్నేండ్ల వరకు నిర్ణీత ఆయకట్టుకు నీళ్లు అందేవి. కానీ కాలక్రమేణా రిజర్వాయర్‌లో పూడికపేరుకుపోవడం, కాలువలకు అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేసుకొని ఆయకట్టేతర భూములకు రైతులు నీటిని మళ్లించడంతో ప్రతి ఏడాది ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ప్రసుత్తం సుమారు 30వేల ఎకరాల ఆయకట్టు, ఆయకట్టేతర భూములు సాగులోకి రానున్నాయి.
రైతుల సమాయత్తం
రేపటి నుంచి నీటిని విడుదల చేయనుండడంతో ఆయకట్టు రైతులు నారుమళ్లను సిద్ధచేసే పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కులు దున్ని నారుమళ్లను చదును చేసి నారును పోస్తూ నీటికోసం ఎదురుచూస్తున్నారు. నీళ్లు అందుబాటులో లేని రైతులు వానాకాలంలో పత్తి, ఇతర ఆరుతడి పంటలు సాగుచేసారు. పత్తివేరడం, ఇతర ఆరుతడి పంటలను తొందరగా తొలగిస్తూ నారుమళ్లు దున్నినార్లు పోస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వానాకాలంలో బీడుభూములు మిగిలిన రైతులు ఈ పాటికే నార్లుపోసి నాట్లు సైతం వేశారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...