ప్రతి చెరువును నింపుతం


Thu,December 5, 2019 01:33 AM

-డిండి ప్రాజెక్టు కింద రెండు పంటలకూ నీరు
-మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు చేయాలి
-వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

డిండి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం రాష్ట్రంలోని ప్రతి చెరువునూ కృష్ణా, గోదావరి నీటితో నింపుతామని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్ర వ్యవసాయానికి నీటివసతి ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వైవిధ్య భూములు ఉన్న మన రాష్ట్రంలో వైవిధ్యమైన పంటలు పండించేందుకు అవకాశం ఉన్నదని రాష్ట్ర అవసరాలకే కాకుండా పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు సీఎం ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి ప్రాజెక్టు నిర్మాణంతోపాటు రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీతోపాటు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏటా సరాసరిన రూ.80 వేలు ప్రభుత్వం నుంచి సహాయం అందుతున్నట్లు తెలిపారు.

డిండి వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రానికి శాశ్వత నీటివసతి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిండి ఫామ్‌లో ఉన్న 176ఎకరాలలో నుండి రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించేందుకు కావాల్సిన ఫైండేషన్‌ షీడ్‌ అభివృద్ధికోసం డిండి ఫామ్‌లోని 30ఎకరాలు రాష్ట్ర సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌కు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హార్టికల్చర్‌ అధికారులతో మాట్లాడి ఫామ్‌ చుట్టూ బార్డర్‌లో టేకు, శ్రీగంధం, వెదురు, కొబ్బరి లాంటి చెట్లు నాటి అహ్లాదాన్ని పెంపొందించేలా హరిత వనం ఏర్పాటుచేస్తామన్నారు. భవిష్యత్తులో ఈ ఫామ్‌ను మోడల్‌ ఫామ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా డిండి ఫామ్‌ నిరాదరణకు గురైందని ఇది మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లా సరిహద్దులో ఉన్నదని రెండు జిల్లాల రైతుల అవసరాలు తీర్చే విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. డిండిలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రిని కోరగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలతో పెరుగుతున్న సాగు విస్తీర్ణంతో పాటుశాస్త్ర సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుందని, ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లి కళాశాల ఏర్పాటుకు కృషిచేస్త్తానని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కోటేశ్వరరావు, జేడీఏ బాలూనాయక్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రంచందర్‌నాయక్‌, జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ విజేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మాదవరం దేవేందర్‌రావు, ఎంపీపీ మాధవరం సునీతజనార్ధన్‌రావు, వైస్‌ ఎంపీపీ పుల్లమ్మ, రైతు సమన్వయసమితి మండల కన్వీనర్‌ వెంకటేశ్వరరావు, స్థానిక సర్పంచ్‌ మేకల సాయమ్మకాశన్న, ఉపసర్పంచ్‌ నూకం వెంకటేష్‌, ఎంపీటీసీలు శ్రీలత, రాధిక, వెంకటయ్య, ఏఓలు లక్పతినాయక్‌, నాగేశ్వర్‌రావు, రవికుమార్‌, ఎఈవోలు, రైతులు పాల్గొన్నారు.


దేవరకొండ, మునుగోడులను సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ తపన
దేవరకొండ, నమస్తేతెలంగాణ : తెలంగాణలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీరందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌తో కలిసి బుధవారం మంత్రి నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. నీరు పారేందుకు అవకాశం ఉన్న అన్నిప్రాంతాలకు దశలవారిగా సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారని అన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు గోదావరి నీళ్ళు అందించడమే సీఎం కేసీఆర్‌ పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. గుట్టల ప్రాంతమైన దేవరకొండ, మునుగోడు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్‌ సంకల్పిస్తున్నారని ఇందులో భాగంగానే ఈ ప్రాంతాన్ని పాలమూరు, రంగారెడ్డి పథకంలో అంతర్భాగం చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాలకు సాగునీరందించడం కఠిన తరమైన ప్రక్రియ అయినప్పటికి నీళ్ళు ఇచ్చితీరుతామని, ఎదురుచూపులు ఎంతో దూరంలో లేవని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు కల్పించిన ఆటంకాల వల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం నెలకొందని, యాసింగి సీజన్‌ తరువాత పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని ఆయన తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి డిండి ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు ఒకటిన్నర టీఎంసీల నీరు చేరిందని, మరో రెండు మూడు వారాల్లో 0.6 టీఎంసీల నీరు చేరితే పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిండుతుందని అన్నారు.


ప్రాజెక్టు నిండిన తరువాత కూడా కల్వకర్తి ఎత్తిపోతల నుంచి నీటి వరద కొనసాగుతుందని, డిండి ప్రాజెక్టు నీటితో అనుసంధానంగా ఉన్న అన్ని చెరువులను నింపేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారని తెలిపారు. బిందు, తుంపర సేద్యం కోసం రెండు లక్షల మంది రైతులు ఉద్యానవన శాఖకు దరఖాస్తు చేసుకున్నారని, నాబార్డ్‌ నిధుల లభ్యతకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే ఈ ప్రక్రియ మొదలవుతుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సీడ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోటేశ్వర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ ఇస్లావత్‌ రాంచంద్రనాయక్‌, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్‌, మాజీ ఎంపిపి మేకల శ్రీనివాస్‌ యాదవ్‌, వైస్‌ ఎంపిపి చింతపల్లి సుభాష్‌, నాయకులు టివిఎన్‌ రెడ్డి, మారుపాకుల సురేష్‌ గౌడ్‌, శిరందాసు కృష్ణయ్య, కేతావత్‌ మంజ్యానాయక్‌, రాజినేని వెంకటేశ్వర్‌రావు, చీదెళ్ళ గోపి, తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...