మారుతున్న పల్లె స్వరూపం


Wed,November 20, 2019 01:23 AM

-అభివృద్ధి దిశగా సాగుతున్న గ్రామాలు
-30 రోజుల ప్రణాళిక ద్వారా నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
-సబ్‌కి యోజన-సబ్‌కా వికాస్ పథకంలో భాగంగా కేంద్రం సర్వే
-పంచాయతీల్లో ప్రజాసమాచార మండలి ఏర్పాటు
- జీడీపీ ఆధారంగా ఆర్థికసంఘం నిధులు
చిట్యాల : పల్లెల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను భాగస్వాములను చేస్తూ రూపొందించిన 30 రోజుల ప్రణాళికతో పల్లెలు అభివృద్ధివైపు అడుగులు వేస్తుండగా .. తాజాగా కేంద్రం కూడా సబ్‌కీ యోజ నా.. సబ్‌కా వికాస్ పథకంలో భాగంగా అన్ని గ్రామాల్లో పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని, వాటి ఆధారంగానే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించాలని భావిస్తోంది. కేంద్రం ఆదేశానుసారం జిల్లాలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ)ని రూపొందించేందుకు సంబంధిత అధికారులు సమాయత్తమవుతున్నారు.

844 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు
జిల్లాలోని 844 గ్రామ పంచాయతీల్లో త్వరలో గ్రామసభలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 29 అంశాలతో చేపట్టబోయే కార్యక్రమాల కోసం గ్రామానికి ఓ కోఆర్డినేటర్‌ను నియమించనున్నారు. గ్రామాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో ఫొటోలతో సహ అప్‌లోడ్ చేస్తారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ ప్రణాళికలు తయారు చేయనున్నారు. మిషన్ అంత్యోదయ చేపట్టిన సర్వే ఆధారంగా ప్రణాళికలు రూపొందించనున్నారు.

ఇప్పటికే 30 రోజుల ప్రణాళిక అమలు
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లో ఇప్పటికే ఎంతో మార్పు వచ్చింది. ఎంతో కాలంగా పరిష్కారానికి నోచని సమస్యలు పరిష్కారమై అభివృద్ధి బాట పట్టాయి. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరుస్తోంది. ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరగగా.. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటం వల్ల కార్యక్రమాలన్నీ పక్కాగా అమలవుతున్నాయి. సెప్టెంబర్ 6న గ్రామసభలతో ప్రారంభమైన 30 రోజుల ప్రణాళికలో అనేక సమస్యలను గుర్తించి పరిష్కరించారు. మొక్కలు నాటారు. 844 గ్రామాలలో 11623 శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి అందులో 10061 ఇళ్లను కూల్చివేశారు. గ్రామాల్లో రహదారులకు సంబంధించిన 17949 సమస్యలను గుర్తించి పరిష్కరించారు. 8645 పారిశుధ్య పనులను గుర్తించగా 7785 సమస్యలను పరిష్కరించారు. 1950 పాతబావులను గుర్తించి 1374 బావులను పూడ్చివేశారు. 871 పడావు బోరు బావులను గుర్తించి 750 మూసివేశారు. 5105 కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల సమస్యలు గుర్తించి 4306 పరిష్కరించారు. 350 గ్రామ పంచాయతీలలో 453 డంపింగ్ యార్డులు అవసరం కాగా 410 నిర్మాణ పనులు ప్రారంభించగా..43 ప్రదేశాల్లో ఖాళీ స్థలాలు లేవని గుర్తించారు. 418 శ్మశాన వాటికలు అవసరమని గుర్తించగా 378 నిర్మాణం ప్రారంభించగా 40 ఇప్పటికే పూర్తి అయ్యాయి. 25536 మంది రైతుల వ్యవసాయ భూములలో 882729 మొక్కలు నాటారు. ఇళ్లలో నాటేందుకు 3615915 మొక్కలు, పరిశ్రమలల్లో 258979, కమ్యూనిటీ సెంటర్‌లలో 592466, రోడ్లకిరువైపులా 854270 మొక్కలు నాటారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో 19852 పారిశుధ్య పనులను గుర్తించి 12617 పనులను పరిష్కరించారు.

30 రోజుల ప్రణాళికలో గుర్తించిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం
జిల్లాలో సెప్టెంబర్‌లో ప్రారంభమైన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీల్లో గుర్తించిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం. జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విజయవంతంగా 30 రోజుల ప్రణాళికలను నిర్వహించాం. ఈ ప్రణాళికలో గ్రామాలకు అవసరమైన పనులను, సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాం.
- విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...