చివరి ఎకరాకూ నీరందించాలి


Wed,November 20, 2019 01:22 AM

-రాజవరం మేజర్‌కు నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే..
-ఎన్‌ఎస్పీ అధికారుల సమీక్షలో మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, నమస్తేతెలంగాణ : అంకెల గారడి అక్కర్లేదని, చివరి ఎకరాకు నీరందించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఎన్‌ఎస్పీ అధికారుల సమీక్షా సమావేశంలో తుంగతుర్తి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, శానంపుడి సైదిరెడ్డిలతో కలిసి సాగర్ ఆయకట్టు చివరిప్రాంతంలో సాగర్ నీటి విడుదల వంటి అంశాలపై సమీక్షించారు. 50ఏండ్ల చరిత్రలో మొదటిసారి రాజవరం మేజర్‌కు నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రైతులకు రెండో పంటకు నీరందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నీటి విడుదల లెక్కలను అధికారులు మంత్రికి వివరిస్తున్న తరుణంలో జోక్యం చేసుకున్న మంత్రి అధికారులను వారిస్తూనే ఇలాంటి లెక్కలు కాదని, పొలాలకు నీరు పారిందా లేదా అన్నదే లెక్క అని తేల్చి చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి అన్ని ప్రాజెక్టుల్లో నీరు పొంగిపొర్లుతుందని, అలాంటప్పుడు చివరి వరకూ నీళ్లు ఎందుకు చేరడం లేదని అధికారులను నిలదీశారు. రాజవరం, పెరూర్ వంటి మేజర్లలో కలిపి 27వేల ఎకరాలకు 26కి.మీటర్లకుగాను 22కి.మీటర్ల వరకే ఉన్న పొలాలకు నీరందడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. నీటి లభ్యత నిల్వలపై అధికారులు ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. గుర్తించిన ఆయకట్టుకు తప్పక నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎగువ ప్రాంతంలో చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మోతాదుకు మించి నీటి విడుదలతో వేసవిలో ఎదురుకానున్న ఇబ్బందులను అధికారులు సమీక్షించుకోవాలన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో చివరిభూములకు నీరు అందడం లేదని, అందుకు పరిష్కారమార్గాలు అన్వేషించాలన్నారు.

చెరువులన్నీ అలుగు పోయాల్సిందే.. : మంత్రి
శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని చెరువులన్నీ నిండి అలుగులు పోయాల్సిందేనని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇరిగేషన్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా అధికారులు పని చేస్తూ క్షేత్రస్థాయిలో చెరువులు, కుంటలు, కాల్వలను పరిశీలిస్తూ సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి నీటి పారుదల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎన్‌ఎస్‌పీ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. గోదావరి జలాలు మంత్రి జగదీశ్‌రెడ్డి అభీష్టం మేరకు ఆపేది లేదంటూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మండలాల వారీగా విచారించిన మంత్రి నేటి వరకు నిండిన చెరువులతోపాటు నింపాల్సిన చెరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరి ఎకరం వరకు నీళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను వాకబు చేయాలన్నారు. మూసీ ఆయకట్టుకు నీటి విడుదల విషయంలో అంతిమంగా రైతుల అభీష్టం మేరకే వదలాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉమ్మడి నల్లగొండ జిల్లా నీటి పారుదలపై సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో గోదావరి జలాలతో 191 చెరువులు నిండగా మరో 124 చెరువులు పురోగతిలో ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అంతే కాకుండా మరో 59 చెరువులు నింపాల్సి ఉందని మంత్రికి తెలిపారు. ఎస్సారెస్పీ కింద ఉన్న డీబీఎం 69,70, 71ల పరిధిలోని చెరువులతోపాటు టెయిల్‌పాండ్, కాకతీయ మెయిన్ కెనాల్ కాల్వలపై ఆయన సమీక్షించారు.

గతంలో తవ్విన కాల్వలు నిరుపయోగంగా మారాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ డిజైన్‌ల ప్రకారం కాల్వలు తవ్వలేదన్నారు. అవన్నీ కేవలం మొక్కుబడిగా తవ్వి బిల్లులు ఎత్తుకున్నారన్నారు. ఆ మాటకు వస్తే అసలు నీళ్లు ఇచ్చే ఉద్దేశమే గత ప్రభుత్వాలకు లేదని, ఉంటే ఇప్పుడు చెరువులు నింపేందుకు ఇంతటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. అలాంటి అవాంతరాలను అధిగమించి జిల్లాలో చెరువులన్నీ నింపుతున్నామని, నింపుతామని మంత్రి స్పష్టం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో చెరువులు నింపడం గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ను గ్రామాల వారీగా అడిగి తెలుసుకోవడంతోపాటు అధికారుల నిర్లిప్తత మూలంగా రైతాంగం పడుతున్న ఇబ్బందులను గురించి ప్రస్తావించారు. సమావేశంలో కలెక్టర్ డి.అమయ్‌కుమార్, జేసీ సంజీవరెడ్డి, ఆర్డీఓ మోహన్‌రావు, నీటి పారుదల అధికారులు హమీద్‌ఖాన్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles