దోమలపై సమరానికి సన్నద్ధం


Sun,November 17, 2019 01:12 AM

-దోమల నివారణ చర్యలపై పాఠశాలల్లో ప్రత్యేక పాఠాలు
-డెంగీ, మలేరియా జ్వరాలపై విద్యార్థులకు అవగాహన
-వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల నిర్వహణ
-ఈ నెల 22నుంచి ప్రతి శుక్రవారం మస్కిటో ఫ్రీ డ్రైడే
-ప్రతి శనివారం హ్యాపీ అవర్.. సాంస్కృతికోత్సవాలు

నల్లగొండ విద్యావిభాగం : దోమలతో జరిగే అనర్థాలు అన్నీఇన్నీ కావు. వీటి కారణంగా వచ్చే పలు రకాల వ్యాధులు ప్రాణంతకంగా ఉండడం, రోజురోజుకూ వాటి ఉధృతి పెరుగుతుండడంతో అధికారులు నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంపైనా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులకు సైతం అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం దోమల నివారణ(డ్రై డే)పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22 నుంచి 10వారాలపాటు కార్యాచరణ కొనసాగనుంది. దీంతోపాటు ప్రతి శనివారం విద్యార్థులను మానసికంగా ఉల్లాసంగా ఉంచేలా హ్యాపీ హవర్‌ను నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు దోమల నివారణపై అవగాహన కల్పించేందుకై డ్రై డే పేరుతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం వెలువడడంతో ఇక పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

దోమలతో వచ్చే వ్యాధులపై అవగాహన..
జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు దోమల ద్వారా సంభవించే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ నివారణ, వృద్ధి చెందే పరిస్థితులు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. మస్కిటో ప్రీ డే (డ్రై డే) పేరుతో ఈ నెల 22 నుంచి 10 వారాల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం విద్యార్థులకు 15 నిమిషాల పాటు వీటిపై ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో అవగాహన కల్పించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ డైరెక్టర్లు, సంయుక్త డైరెక్టర్లతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వి. జనార్దన్‌రెడ్డి సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.

లక్షణాలను గుర్తించేలా....
మలేరియా, టైపాయిడ్, డెంగీ వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయి. వ్యాధి కారక క్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇంక్యుబేషన్ పిరియడ్ (పొదిగే కాలం)లో శరీరంలో పలు మార్పులపై విద్యార్థులకు సవివరంగా అవగాహన కల్పిస్తారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ పద్ధతులను వివరిస్తారు.

ఆయా అంశాల్లో పోటీలు...
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు, లక్షణాలు , నివారణ చర్యలు తదితర అంశాలపై విద్యార్థులకు ప్రతి శుక్రవారం క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి చైతన్యం చేస్తారు. ఉపాధ్యాయులంతా విధిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పోటీల్లో విజేతలైన వారికి ప్రోత్సాహకాలు అందించి ఉత్తేజ పరచనున్నారు.
ప్రతి శుక్రవారం పాఠశాలలో డ్రైడే...
ఈ నెల 22 నుంచి రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేర కు అన్ని పాఠశాలల్లో కచ్చితంగా మస్కిటో ఫ్రీ డే (డ్రైడే)తోపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాలల ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కనీసం 15 నిమిషాల పాటు మధ్యాహ్నం అవగాహన కల్పించాలి. అంతేగాకుండా విద్యాశాఖ సూచించిన 25 అంశాలపై ప్రశ్నావళి సిద్ధ్దం చేసి వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యతోపాటు ఈ అంశాలపై విద్యార్థులను సిద్ధ్దం చేయనున్నారు.

ప్రతి శనివారం హ్యాపీ అవర్...
చదువుతో పాటు మానసికంగా ఉల్లాసంగా తయారు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రతి శనివారం గంటపాటు హ్యాపీనెస్ అవర్ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా చదవడం, రాయడం పక్కన పెట్టి గంటపాటు మానసికోల్లాసానికి సంబంధించిన అంశాలను విద్యార్థులకు బోధించి ఒత్తిడి జయించేలా సంసిద్ధం చేస్తారు. నవ్వించే అంశాలు, ఆనందం కలిగించే నాటికలు, ఇతర అంశాలను ఆయా పాఠశాలల పరిస్థితుల కనుగుణంగా నిర్వహించేలా హెచ్‌ఎం అధ్యక్షతన ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...