వసతి గృహాల్లో కంప్యూటర్‌ విద్య


Wed,November 13, 2019 02:50 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : ఉన్నత విద్యను అభ్యసిస్తు కళాశాల వసతి గృహాల్లో వసతి పొందే విద్యార్థులకు ఇప్పటికే అనేక సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా వారికి కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించాలని నిర్ణయించింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్‌లో ఉన్న 15 వసతి గృహాల్లో ఈ కంప్యూటర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో భాగంగా 260 కంప్యూటర్లు మంజూరు కాగా.. ఇప్పటికే ఏడు వసతి గృహాల్లో వాటిని బిగించి విద్యార్థులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నారు.

అన్ని వసతి గృహాల్లో కంప్యూటర్లు
తెలంగాణ సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే కళాశాల వసతి గృహాల్లో వసతి పొందే విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అందిస్తోంది. కళాశాల వసతి గృహాల్లో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీటెక్‌, పాలిటెక్నిక్‌, బీఫార్మసి విద్యను పలు కళాశాలల్లో అభ్యసిస్తూ హాస్టళ్లలో వసతి పొందుతున్నారు. వారికి ప్రాజెక్టు వర్క్‌ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వారు బయట ఉన్న నెట్‌ సెంటర్‌కు వెళ్లి డబ్బులు చెల్లించి పని చేసుకోవాల్సి వస్తోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం అన్ని సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి పది మందికి ఒక కంప్యూటర్‌ చొప్పున కేటాయిస్తూ నిధులు మంజూరు చేయడంతో అధికారులు వాటిని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

రూ. 1.28 కోట్లతో 260 కంప్యూటర్లు
నల్లగొండలో 5 బాలికల, 4 బాలుర కళాశాల వసతి గృహాలుండగా దేవరకొండ-2, మిర్యాలగూడ-2, నకిరేకల్‌లో రెండు చొప్పున ఉన్నాయి. ఆయా వసతి గృహాల్లో 2152 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రతి పది మందికి ఒక కంప్యూటర్‌ చొప్పున మొత్తం 260 కంప్యూటర్లకు గానూ ప్రభుత్వం రూ. 1.28 కోట్లు వెచ్చించి వాటిని కొనుగోలు చేసింది. ఇప్పటికే శాశ్వత భవనాలు ఉన్న ఏడు వసతి గృహాల్లో కంప్యూటర్లను బిగించి విద్యార్థులకు అందుబాటులో ఉంచగా అద్దె భవనాల్లో త్వరలో బిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్‌ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులు ఈ కంప్యూటర్లను తమ ప్రాజెక్టు వర్కుతో పాటు ఇతర కోర్సులు నేర్చుకోవడానికి వినియోగించుకుంటున్నారు.

అన్ని హాస్టళ్లలో ఏర్పాటు చేస్తాం
జిల్లాలో 15 కళాశాలలకు సంబంధించిన వసతి గృహాలున్నాయి. వాటిలో కంప్యూటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 1.28 కోట్లు కేటాయించి 260 కంప్యూటర్లు కేటాయించింది. ఇప్పటికే ఏడు వసతి గృహాల్లో వాటిని ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాం. మిగిలిన వాటిలో త్వరలో బిగిస్తాం.
-రాజ్‌కుమార్‌, డీడీ సాంఘీక సంక్షేమ శాఖ

మా పని సులువైంది..
నేను బీఫార్మసి చదువుతున్నాను. నాకు సబ్జెక్టు పరంగా కంప్యూటర్‌ చాలా అవసరముంటుంది. దాంతో ప్రతిసారి బయటకు వెళ్లి నెట్‌ సెంటర్లలో డబ్బులు చెల్లించి ప్రాజెక్టు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు మా హాస్టల్‌లోనే కంప్యూటర్‌ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఏ ప్రాజెక్టు వర్క్‌యినా ఇక్కడే చేసుకోవచ్చు.
-ఎం. మోనేశ్వరి, ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహం(ఎ), నల్లగొండ

బయటకు వెళ్లే బాధ తప్పింది
నేను ఉమెన్స్‌ కళాశాలలో కంప్యూటర్‌ అప్లికేషన్‌ విభాగంలో డిగ్రీ చేస్తున్నాను. నాకు నిత్యం కంప్యూటర్‌ అవసరం ఉంటుంది. కాలేజీలో నేర్చుకున్నది మళ్లీ ప్రాక్టీస్‌ చేసుకుందామంటే ఇబ్బందిగా ఉండేది. ప్రతిసారి బయటకు వెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక ఆ బాధ తప్పినందుకు సంతోషంగా ఉంది.
-ఎ. సుస్మిత, డిగ్రీ తృతీయ సంవత్సరం

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...