‘పది‘లో ప్రథమస్థానమే లక్ష్యం


Wed,November 6, 2019 02:09 AM

నల్లగొండ విద్యావిభాగం : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అందుకు గాను రూపొందించిన యాక్షన్‌ప్లాన్‌ను ఇప్పటికే అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. జిల్లాలో 291 ఉన్నత పాఠశాలలు ఉండగా అన్నింటిలో డిసెంబర్‌ 31 నాటికి పదో తరగతి సిలబస్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ నుంచి ఆదేశాలందాయి. దీంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి వారు ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా 96.44 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 11వ స్థానంలో నిలవగా ఈ సారి మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు.

ప్రత్యేక తరగతుల నిర్వహణ
పదో తరగతి విద్యార్థులకు సకాలంలో సిలబస్‌ పూర్తిచేయడంతో పాటు ఆయా సబ్‌జెక్టుల్లో నైపుణ్యం సాధించి పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచేదిశగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. దీంతో ఆయా పాఠశాలల్లో ఇప్పటికే ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. పాఠశాల ఉదయం 9.30 కు ప్రారంభమై సాయంత్రం 4:45 గంటలకు ముగుస్తుంది. కానీ పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 వరకు, సాయంత్రం 4:45 నుంచి 5.30 వరకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. సిలబస్‌ పూర్తి చేసిన అనంతరం ప్రతి రోజు ఒక సబ్‌జెక్టుపై విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. సిలబస్‌ పూర్తికాగానే గ్రాండ్‌ టెస్టులు నిర్వహించి వారిని ప్రీ-ఫైనల్‌ పరీక్షలకు సిద్ధం చేయనున్నారు. అవసరమైతే ఉపాధ్యాయులు విద్యార్థులను గ్రూప్స్‌గా విభజించి వారి సామర్థ్యాల ఆధారంగా ఉత్తీర్ణత శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఫ్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారిపై ప్రత్యేక దృష్టి కేటాయించనున్నారు. ఉత్తమంగా రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తే వారు మరింత ఉత్సాహంగా ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం ఉందని విద్యా శాఖ సూచించింది.

దాతల సహకారంతో అల్పాహారం
జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతులకు వచ్చే విద్యార్థులకు దాతల సహకారంతో అల్పాహారం అందించే విధంగా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థులు ఆకలిపై కాకుండా కేవలం చదువుపైనే శ్రద్ధ వహించే అవకాశం ఉంటుంది. దాతలు అందుబాటులో లేని పాఠశాలల్లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా అల్పాహారం అందించి పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.

291 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యాచరణ
జిల్లా వ్యాప్తంగా 31మండలాల్లో ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 291 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, లోకల్‌ బాడీ పాఠశాలలు 230, కస్తూర్భా పాఠశాలలు 27, మోడల్‌ స్కూల్స్‌ 17, ఎయిడెడ్‌ పాఠశాలలు 17 ఉన్నాయి. వీటిలో ఈ విద్యాసంవత్సరం సుమారుగా 20 వేలకు పైగా విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షకు హాజరు కానున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు మరో 217ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా పదిలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించేందుకు ఆయా యాజమాన్యాలకు సైతం విద్యాశాఖ సూచనలు చేస్తోంది.

నిర్ణీత సమయంలో సిలబస్‌ పూర్తి చేసేలా చర్యలు
అన్ని పాఠశాలల్లో డిసెంబర్‌ చివరినాటికి పదవతరగతి సిలబస్‌ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలంటే భయం తొలగించి మానసికంగా సిద్ధమయ్యేలా చేసేందుకు ఈ నెల 4నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించాం. తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు దాతల సహకారంతో అల్పాహారం అందించాలని సూచించాం. తరగతిలో వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమీక్ష జరిపి వారు కూడా ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.
- బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ

పది ప్రత్యేక తరగతులను తనిఖీ చేసిన డీఈఓ
నల్లగొండరూరల్‌ : పదోతరగతి విద్యార్థులకు ప్రారంభమై న ప్రత్యేక తరగతుల నిర్వహణనను డీఈఓ బి. భిక్షపతి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భా గంగా నల్లగొండ మండలంలోని దోమలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను సందర్శించి తొలుత రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులకు దాతల సహకారంతో నిర్వహిస్తున్న అల్పాహారం (స్నాక్స్‌)ను అందజేసి తరగతుల నిర్వహణ తీరుపై అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారికి మనోధైర్యం కలిగించే విధంగా సందేశాన్నిచ్చి స్ఫూర్తి నింపారు. పదో తరగతి పరీక్షలకు సంసిద్దులై ఉత్తీర్ణత పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎ. ప్రమీల, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, తాటికొండ బ్రహ్మచా రి, యాదయ్య, ఎలీసా, జానకి, సత్యవతి, జోస్పినమ్మ, నాగమణి, కస్తూరి, డీఈఓ సీసీ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...