బంద్ పాక్షికం


Sun,October 20, 2019 04:19 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ జేఏసీ శనివారం తలపెట్టిన రాష్ట్రబంద్ బస్సులు మినహాయిస్తే మిగతా చోట్ల పెద్దగా కనిపించలేదు. ఉదయం పూట జిల్లా కేంద్రంతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, మునుగోడు, హాలియా ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో దుకాణాలను వ్యాపారులు మూసివేశారే తప్ప మిగిలిన ప్రాంతాల్లో రోజులాగానే వ్యాపార సముదాయాలు కొనసాగాయి. మధ్నాహ్నం తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాల్లోనూ వ్యాపార సముదాయాలు ప్రారంభంకావడంతో ప్రజలు తిరిగి రోజువారి పనుల్లో భాగస్వాములయ్యారు. అయితే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా టీఎన్జీవోస్, రెవెన్యూ అసోసియేషన్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఉదయం పూట కాసేపు నిరసనలు వ్యక్తం చేశారు.

పలు ప్రాంతాల్లో నిరసనలు...
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయా సంఘాలతో పాటు పార్టీల నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ, టీడీపీలతో పాటు ఆయా సంఘాల నేతలు ఆర్టీసీ బస్టాండ్‌లో కాసేపు ధర్నా నిర్వహించి వంటావార్పు కార్యక్రమం చేపట్టి అక్కడే నిరసనగా భోజనం చేశారు. టీఎన్జీవోస్, రెవెన్యూ అసోసియేషన్ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన నినాదాలు చేపట్టారు. నార్కట్‌పల్లిలో సీపీఐ,సీపీఎం,కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా మిర్యాలగూడలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నకిరేకల్, నాగార్జునసాగర్, కట్టంగూర్‌లోనూ కాంగ్రెస్, సీపీఎం నేతలు ర్యాలీ తీయగా దేవరకొండలో బస్టాండ్ వద్ద నిరసనగా అక్కడే భోజనం చేశారు. అదే విధంగా ఆయా మండల కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆయా బస్టాండుల్లో బందోబస్తు నిర్వహించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...