ప్రతి ఇంటికీ పండ్ల మొక్కలు


Fri,October 18, 2019 02:34 AM

-గ్రామాలను పచ్చగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు
-వచ్చే ఏడాది ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందించేలా చర్యలు
-వేప, కృష్ణ తులసీతో పాటు మరో నాలుగు పండ్ల మొక్కలు
-ఏటా హరితహారానికి 10శాతం గ్రామ పంచాయతీ నిధులు
-2020-21 సం.లో 844 జీపీలకు 73.45లక్షల మొక్కలు
నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాతం తక్కువగా ఉండి వర్షాభావ పరిస్థితులు నెలకొంటుండడంతో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నుంచి ప్రతి ఏటా హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. అందులో భాగంగానే జిల్లాకు గడిచిన నాలుగేళ్లుగా 2.2కోట్ల మొక్కల చొప్పున కేటాయించి వాటిని పెంచడంతోపాటు పలు శాఖల ఆధ్వర్యంలో మొక్కల నాటింపు చేశారు. జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర, గ్రామీణ రహదారులపైన మొక్కలు నాటిన నేపథ్యంలో ప్రతి ఇంటింటికీ మొక్కలు నాటించాలని సర్కార్ యోచిస్తోంది. అందులో భాగంగానే ఏ గ్రామానికి ఎన్ని మొక్కలు కావాలనే దానిపై ప్రత్యేక ప్రణాళికలు 30రోజుల కార్యక్రమంలో రూపుదిద్దుకున్నాయి. దీనికి అనుగుణంగా గుర్తించిన నర్సరీల్లో మొక్కలు పెంచి 2020-21 సంవత్సరంలో ఇంటింటికి సరఫరా చేయనున్నారు.

వచ్చే ఏడాది ఇంటింటికీ ఆరు మొక్కలు..
రాష్ట్రంలో అటవీ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హరితహారం పథకం కోసం ప్రతి ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం 2.2కోట్ల మొక్కలు గడిచిన 4 సంవత్సరాల్లో నాటగా ఈసారి ప్రతి ఇంటిలోను మొక్కలు నాటించాలని సర్కార్ ఆలోచిస్తుంది. అయితే ఈ దఫా ప్రతి ఇంటికి ఆరు మొక్కలను అందజేసి వాటిని రక్షించి పెంచే విధంగా ఆ ఇంటి సభ్యులకే బాధ్యత అప్పగించనున్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందజేస్తు అందులో వేపతోపాటు కృష్ణతులసి(దోమల నివారణకు ఉపయోగపడే మొక్క) ఉండేలా జాగ్రత్తలు చేపడుతూ వచ్చే ఏడాది వీటిని సరఫరా చేయనున్నారు.
పకడ్బందీగా గ్రీన్‌ప్లాన్ అమలు
ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని సర్కార్‌సూచన మేరకు అధికార యంత్రాంగం ఇటీవల జరిగిన 30రోజుల ప్రణాళికలో పకడ్బందీగా గ్రీన్‌ప్లాన్‌ను రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటిని తట్టిన అధికారులు గ్రీన్‌ప్లాన్‌లో భాగంగా వారి అభిప్రాయాలను తీసుకున్నారు. సర్కార్ సూచించిన వేప, కృష్ణతులసితోపాటు మరో 4 పండ్ల మొక్కలను ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తు దానికి అనుగుణంగా ఆ ఇంటి సభ్యులకు ఇష్టమైన 4 మొక్కల జాబితాను రికార్డుల్లో రాశారు. పండ్ల మొక్కల్లో జామ, మామిడి, దానిమ్మ, సీతాఫల్, నేరేడు, నిమ్మ లాంటి మొక్కలు కావాలని ఈ సర్వేలో వెల్లడించారు. ఇళ్లతో పాటు పొలాల దగ్గర పెట్టుకోవడానికి రైతులకు, వీధుల్లోను మొక్కలు నాటుకోవడానికి ఇవ్వనున్నారు.

గుర్తించిన నర్సరీల్లోనే మొక్కల పెంపు..
జిల్లాలోని 844 గ్రామ పంచాయతీల్లో ఇంటికి ఆరు మొక్కల చొప్పున ఇవ్వడంతో పాటు రైతులకు, వీధుల్లోను నాటుకోవడానికి మొత్తం 73.45 లక్షల మొక్కలు అవసరమవుతాయని ప్రత్యేక కార్యాచరణలో చేపట్టిన సర్వేలో లెక్కతేలింది. ఇందులో ఇళ్లలో పెట్టుకోవడానికి 28.80 లక్షల మొక్కలు రైతులు పొలాల వద్ద నాటుకోవడానికి 19.78 లక్షలు, గ్రామ వీధుల్లో, ఇంటి ముం దర నాటుకోవడానికి మరో 23.57 లక్షలు ఇవ్వనున్నారు. ఇంతేగాక ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ నిధుల్లో 10 శాతం హరితహారం మొక్కల పెంపకానికి, అవసరమైన పండ్లు లేదా ఇతర చెట్లు కొనుగోలుకు, ట్రీగార్డులు కొనుగోలు చేయడానికి వినియోగించుకోవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా వచ్చే ఏడాది 73.45 లక్షల మొక్కలు ఆయా గ్రామాలకు అవసరం ఉండగా గుర్తించిన 811 నర్సరీలల్లో వీటిని పెంచనున్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...