పురపాలికలన్నీ పరిశుభ్రంగా మారాలి


Wed,October 16, 2019 01:09 AM

- పురపాలిక, పట్టణ పారిశుధ్యంపై ప్రణాళిక తయారు చేయాలి
- పట్టణాల్లో పబ్లిక్ టాయ్‌లెట్ల నిర్వహణపై దృష్టి సారించాలి
- ప్రతీ కార్మికుడికి పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించేలా చూడాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్
నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని అన్ని పురపాలికలను పరిశుభ్రంగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన అన్ని పురపాలక శాఖల అధికారులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన 30 రోజుల ప్రణాళిక కు గ్రామ పంచాయతీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అదేస్ఫూర్తితో పట్టణాల్లోను అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పురపాలిక, పట్టణ పారిశుధ్యంపైన ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. చెత్త సేకరణ నుంచి రీసైక్లింగ్ వరకు అన్ని వివరాలను ప్రణాళికలో చేర్చాలన్నారు. పురపాలికలో పారిశుధ్య కార్మికుల సంఖ్య, వాహనాల సంఖ్య స్వచ్ఛ సర్వేక్షన్ మార్గదర్శకాల మేరకు ఉండేలా చూడాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి తడి పొడి చెత్త సేకరణపైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే పాత మున్సిపాలిటీలకు స్వచ్ఛ ఆటోలు ఇచ్చా మని, అవసరం ఉంటే వాహనాలను, సిబ్బందిని పెంచుకోవచ్చని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు యూనిఫాంతో పాటు అవసరమైన రక్షణ సామగ్రిని సమకూర్చాలన్నారు. ప్రతీ కార్మికుడికి పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలను కల్పించేలా ఆయా ఏజెన్సీలను ఆదేశించాలని సూచించారు. పంచాయతీ సిబ్బంది మాదిరిగానే పురపాలక సిబ్బందికి ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి తెలిపారు. ప్రతీ పట్టణానికి ఒక డంప్‌యార్డు ఉండాలని, డంప్‌యార్డు లేనిచోట స్థల సేకరణకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. డైరీ ఫోర్సు కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే అన్ని పురపాలికలు ఓడీఎఫ్(ఓపెన్ డిపికేషన్ ఫ్రీ) సాధించాయని, కొత్త మున్సిపాలిటీలుగా కూడా సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పట్టణంలో పబ్లిక్ టాయ్‌లెట్స్ నిర్వహణపైన దృష్టి సారించాలని, అవసరమైతే నిర్మాణం చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని పెట్రోలు బంక్‌లు, రెస్టారెంట్లలో టాయిలెట్స్‌ని ప్రజలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు వాటి యజమానులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం వరంగల్, సిరిసిల్ల మాదిరి ప్రతి పట్టణంలో మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా పని చేయాలని సూచించారు. ప్రతీ పట్టణానికి సమగ్రమైన సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసి వారం రోజుల్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సమర్పించాలన్నారు.

నూతన పురపాలక చట్టాన్ని అమలు చేయడంలో కలెక్టర్లు శ్రద్ద వహించాలన్నారు. చట్టంలో పేర్కొన్నట్లుగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి పురపాలిక బడ్జెట్‌లో 10 శాతం కేటాయించాలని సూచించారు. దీంతోపాటు పట్టణంలో లేదా పట్టణాలకు దగ్గరలో గ్రీన్ లంగ్ స్పేస్(పెద్ద పార్కులను)ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, సీడీఎం శ్రీదేవి, వాటర్ వర్కు డైరెక్టర్ దాన కిషోర్ పాల్గొన్నారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీ మినహా అన్ని మున్సిపాలిటీల్లో డంపింగ్‌యార్డులు ఉన్నట్లు తెలిపారు. జిల్లా మినరల్ పౌండేషన్ ట్రస్టు ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 30 ట్రాక్టర్లు, 60 ఆటోలు, రెండు జేసీబీలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ చంద్రశేఖర్, ఆర్డీఓలు జగన్నాథరావు, లింగ్యానాయక్, మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్, మున్సిపాలిటీల ప్రత్యేకాధికారులు ఆర్.శ్రీనివాసమూర్తి, రాజ్‌కుమార్, వెంకటేశ్వర్లు, నారాయణస్వామి పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...