మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్‌ మృతి


Sun,October 13, 2019 12:19 AM

త్రిపురారం : మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకుడు గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌(72) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని శనివారం తెల్లవారుజామున ఆయన స్వస్థలమైన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లికి తీసుకురాగా.. పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించారు. రాంమ్మూర్తియాదవ్‌ మరణవార్త తెలియడంతో నియోజకవర్గం శోకసంద్రంలో మునిగిపోయింది. వేకువజాము నుంచే వివిధ జిల్లాల నుంచి రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివచ్చారు.

రామ్మూర్తియాదవ్‌ ప్రస్థానం...
గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌ 1947 అక్టోబర్‌ 26న గుండెబోయిన మట్టయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఒక సో దరుడు, ఆరుగురు అక్కాచెల్లెళ్లున్నారు. పీయూసీ విద్యాభ్యాసం పూర్తి చే యగా.. విద్యార్థి దశలోనే పాఠశాల ప్రెసిడెంట్‌గా, పలు విద్యార్థి సంఘాల నాయకుడిగా పనిచేశారు. కబడ్డీ క్రీడాకారుడిగా రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటారు. తొలిసారిగా 1981సంవత్సరం లో పెద్దదేవులపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన రామ్మూరియాదవ్‌ నాగార్జునసాగర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డికి ఆప్తమిత్రుడు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగి జానారెడ్డిపై విజయం సాధించారు. 2014సంవత్సరంలో కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. రామ్మూర్తియాదవ్‌కు ఇద్ద రు కుమారులు, ఆరుగురు కూతుళ్లున్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌కు రామ్మూర్తియాదవ్‌ స్వయానా మేనమామ కాగా తన కూతురును బడుగులకు ఇచ్చి వివాహం చేశారు.

పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం...
రామ్మూర్తి యాదవ్‌ భౌతికకాయాన్ని సందర్శించేందకు గ్రామస్తులతో పాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌, తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కుందూరు జానారెడ్డి, వేముల వీరేశం, భారతీరాగ్యానాయక్‌ తదితరులున్నారు.

మంత్రి జగదీష్‌రెడ్డి దిగ్భ్రాంతి
సూర్యాపేట టౌన్‌ : చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌ మృతి పట్ల విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన రామ్మూర్తియాదవ్‌ నిమ్న జాతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మచ్చలేని నాయకుడిగా నిరాడంబరుడిగా, ఆజాత శత్రువుగా ఆయన పాటించిన విలువలు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సంతాపం
నల్లగొండ, నమస్తే తెలంగాణ : మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌ మృతి పట్ల శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1994 నుంచి 1999 వరకు చలకుర్తి ఎమ్మెల్యేగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రామ్మూర్తియాదవ్‌ ఎంతో కృషి చేశారన్నారు. సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి అన్ని పార్టీలకు అజాత శత్రువుగా ఉన్న అరుదైన నాయకుడని కొనియాడారు. ఆయన మృతి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...