మూసీ గేటు పనులు శరవేగంగా..


Sun,October 13, 2019 12:19 AM

సూర్యాపేట రూరల్‌ : వరద ఉధృతికి ఇటీవల ఊడిపోయిన మూసీ ప్రాజెక్టు 5వ రెగ్యులేటరీ గేటు స్థానంలో కొత్తదాని ఏర్పాటు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్‌, ఇరిరేషన్‌ అధికారులతో పాటు ఇతర టెక్నికల్‌ నిపుణులు ప్రాజెక్టువద్దే ఉండి నూతన గేటు ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నారు. మూసీ గేటు ధ్వసమైన వెంటనే అధికారులు దాని స్థానంలో వేరే గేటు ఏర్పాటు కోసం చర్యలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని కళ్యాణి డ్యాం వద్ద ఉన్న రెండు గేటు భాగాలను తీసుకురాగా మిగిలిన భాగాలను హైదరాబాద్‌ మియాపూర్‌లో తయారు చేయించారు. వాటిని మియాపూర్‌ నుంచి ప్రత్యేక వాహనంలో శనివారం ఉదయం మూసీ డ్యాం వద్దకు తీసుకొచ్చారు. 0.6 మీటర్ల ఎత్తు, 42 ఫీట్ల వెడల్పు ఉన్న గేటు భాగాలను భారీ క్రేన్ల సాయంతో దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి అమర్చారు. గేటుకు సంబంధించిన మొదటి భాగం విజయవంతంగా బిగించగా.. మిగిలిన భాగాలను కూడా బిగించే పనులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం లోగా గేటు ఏర్పాటు పనులు పూర్తవుతాయని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. మూసీ గేట్ల బిగింపు కార్యక్రమాన్ని నాగార్జునసాగర్‌ సీఈ నర్సింహ, ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ హమీద్‌ఖాన్‌తో పాటు ఈఈ భద్రు, డీఈ నవికాంత్‌లు పర్యవేక్షిస్తున్నారు.

కంకర కదలడంతోనే..
మూసీ డ్యాం నిర్మాణ సందర్భంలో గేటు భాగంలో వేసిన కంకర కదలడం వల్లే 5వ నెంబర్‌ రెగ్యులేటరీ గేటు ధ్వంసానికి కారణమని నిపుణులు తేల్చారు. నీటి ఒత్తిడికి నిజాంకాలం నాటి మూసీ డ్యాంకు ఉన్న గేటు తొలగిపోవడంతో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వెనువెంటనే స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లగా కొత్త గేటు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో పనులు చకచకా కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావులతో పాటు ఇరు జిల్లాల కలెక్టర్లు కూడా డ్యాంను సందర్శించి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తుండగా ఎవరూ ఊహించని రీతిలో నూతన గేటు బిగించే పనులు జరుగుతున్నాయి. గేటు ధ్వంసం అయిన తరువాత ప్రాజెక్టులోని 4.46 టీఎంసీల నీరు దిగువకు పోగా ప్రస్తుతం 0.35 టీయంసీల నీరు ఉంది. మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం 645అడుగులకు గాను ప్రస్తుతం 617.50 అడుగులుగా ఉంది. శనివారం 3వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ధ్వంసం అయిన గేటు ద్వారా 3500 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు కుడి కాలువ నుంచి 175 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 175 క్యూసెక్కులతో కలిపి మొత్తం 3850 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...