- రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
- ఉత్తమ్ మాయమాటలు నమ్మొద్దు
- విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
మేళ్లచెర్వు : ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాయ మాటలు చెబుతూ గెలుస్తున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆటలు ఇక సాగవని, హుజూర్నగర్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం మేళ్లచెర్వు మండలం వేపలమాధవరంలో అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచార రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఉత్తమ్ తనను గెలిపిస్తే ముఖ్యమంత్రిని అవుతానని, ఆ తరువాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినప్పడు కేంద్ర మంత్రిని అవుతానని నియోజకవర్గ ప్రజలకు మభ్య పెడుతూ పబ్బం గడుపుకొన్నాడని విమర్శించారు. పార్టీలకతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తోన్న టీఆర్ఎస్ను గెలిపిస్తే నాలుగేళ్లలో అభివృద్ధి పనులు చేసి చూపెడ్తామన్నారు. ఉత్తమ్, జానారెడ్డి సహా సొంత భూములకు రైతుబంధు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. ఉత్తమ్‌కు ఓటేసి సమస్యలు సైదిరెడ్డికి చెప్తే పరిష్కారం కావన్నారు. ఉత్తమ్ పదవి లేకుండా ఉండలేడని, తనకే కాక భార్యకు కూడా పదవి కావాలా అని ఆయన ప్రశ్నించారు. సైదిరెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఒక్కసారి ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కోసం సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అంతకుముందు కందిబండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళనైన తనను ఓడించడానికి ఇంత మంది వచ్చారంటున్న పద్మావతికి 2014 ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను ఓడించినప్పుడు ఎటు పోయిందన్నారు. సినీ దర్శకుడు శంకర్ మాట్లాడుతూ సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరగా ఉండే రాజేశ్వర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డిల సహకారంతో అధిక నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడన్నారు. ఈ సందర్భంగా మేళ్లచెర్వు ఉపసర్పంచ్ పసుపులేటి నాగేశ్వరరావుతో పాటు కందిబండ గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, కంచర్ల భూపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావుతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.