కుండపోత


Wed,September 18, 2019 02:24 AM

-కరువును పూడ్చేలా జిల్లాలోపలు చోట్ల భారీ వర్షం
- నల్లగొండలో అత్యధికంగా 20.03సెంటీ మీటర్ల వర్షపాతం
- అనుములలో 13.25, కనగల్‌లో 9.5 సెం.మీ.లు
- మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండల్లోనూ భారీ వాన
- వీధులన్నీ జలమయం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
- పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద
- పారుతున్న పలు వాగులు.. చెరువులు, కుంటలకు జలకళ
(నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
జిల్లాలో కుండపోత వాన కురిసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకూ ఎడతెరిపిలేకుండా దంచికొట్టింది. జిల్లా కేంద్రమైన నల్లగొండలో సాయంత్రం 7గంటలకే అత్యధికంగా 20.03సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తిప్పర్తి, కనగల్, హాలియా, దామరచర్ల, మిర్యాలగూడ, దేవరకొండ, పెద్దవూర, చిట్యాల, నకిరేకల్, చండూరు సహా జిల్లా అంతటా దాదాపుగా భారీ వర్షం కురిసింది. నల్లగొండ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు పోటెత్తడంతో వాహన దారులకు ఇబ్బందులు తప్పలేదు. మిర్యాలగూడ, హాలియా, నల్లగొండ, దేవరకొండ సహా దాదాపుగా జిల్లా అంతటా నాలుగు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణాల్లో జన జీవనం స్తంభించింది. ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వానతో ఇన్ని రోజులు నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి రైతాంగానికి ఊరట లభించింది. భారీ వర్షాలతో పలు చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరడంతోపాటు.. వాగులు సైతం పారుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మంగళవారం కుండపోత వాన కురిసింది. వారం రోజులుగా ఎక్కడా పెద్దగా చినుకులు కూడా కురవని పరిస్థితుల్లో.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ సీజన్‌లోనే అత్యధికంగా వర్షం కురవడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. మంగళవారం మద్యాహ్నం ఒంటి గంట నుంచే దేవరకొండ, మిర్యాలగూడ సహా పలుచోట్ల భారీ వాన కురిసింది. హాలియా, నిడమనూరు, దామరచర్ల, పెద్దవూర, తిప్పర్తి, మాడ్గులపల్లి, కట్టంగూర్, తిరుమలగిరి సాగర్, కొండమల్లెపల్లి, డిండి, శాలిగౌరారం, త్రిపురారం మండలాల్లోనూ వర్షం కొనసాగింది. సాయంత్రం నుంచి నల్లగొండ సహా కనగల్, చిట్యాల నార్కెట్‌పల్లి, చండూర్ మండలాల్లో వర్షం ప్రారంభమైంది. మునుగోడు, పీఏ పల్లి, మర్రిగూడ, చింతపల్లి మండలాల్లోనూ వర్షం కురిసింది. మిర్యాలగూడ పట్టణంలో మద్యాహ్నం గంటసేపు, సాయంత్రం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. హాలియాలో నాలుగు గంటలపాటు ఎడతెరిపి ఇవ్వకుండా వర్షం కురవడంతో వీధులన్నీ జలమయం అయ్యాయి.

నల్లగొండలో లోతట్టు ప్రాంతాలు జలమయం
నల్లగొండ పట్టణంలో సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు విరామం లేకుండా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, కలెక్టరేట్, బీటీఎస్, క్లాక్ టవర్, భాస్కర్ టాకీస్, పానగల్ చౌరస్తా సహా ప్రాంతాల్లో రహదారుల పై వరద పోటెత్తింది. వీటీ కాలనీ, విద్యానగర్, పాత బస్తీలో పలు ఇండ్లల్లోకి వరద నీరు చేరింది. మిర్యాలగూడలో రాజీవ్ చౌక్, బస్టాండ్, మెయిన్ రోడ్డు వరద నీటితో జలమయం అయ్యాయి. జిల్లా అంతటా గంటల తరబడి విద్యుత్ సరఫరా స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నల్లగొండలో అత్యధికంగా 20.03 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం రాష్ట్ర వ్యా ప్తంగా కురిసిన భారీ వర్షాల్లో నల్లగొండలో కురిసిన వర్షమే అత్యధికం కావడం విశేషం. అను ములలో 13.25, దామరచర్లలో 8.0, కనగల్‌లో 9.5, తిప్పర్తిలో 8.2 సెంటీమీటర్లు, నార్కట్‌పల్లిలో 7.0 వర్షం కురిసింది. అర్థరాత్రి వరకూ పలుచోట్ల వర్షం పడుతూనే ఉంది. జిల్లా అంతటా పలు చోట్ల చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. వాగులు, వంపులు సైతం పొంగి పొర్లుతున్నాయి. నాన్ ఆయకట్టులో సరైన వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కురిసిన భారీ వర్షంతో రైతాంగం ఊపిరి పీల్చుకుంది.

212
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...