- మొక్కలను పెంచి ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచాలి
- దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన మాల్యా
- విష్ణుపురం రైల్వేస్టేషన్లో స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న జీఎం
దామరచర్ల : రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని దక్షిణమధ్యరైల్వే జీఎం గజానన మాల్య అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా జాన్‌పహాడ్ రైల్వేలైన్‌ను పరిశీలించిన అనంతరం దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడ చెత్త అధికంగా ఉండటంతో వెంటనే సఫాయి కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. స్టేషన్ ఆవరణలోనూ చీపురులో ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్లలో చెత్త పేరుకు పోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పరిసరాల్లో పనికిరాని చెట్లను తొలగించి ప్రయాణికులకు అహ్లాదాన్ని పంచే మొక్కలను నాటి సంరక్షించాలని ఆదేశించారు. జాన్‌పహాడ్ నుంచి దామరచర్లకు నూతనంగా వేసిన లైన్లను ఆయన ప్రత్యేక ట్రైన్లో పరిశీలించారు. విష్ణుపురం నుంచి యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు అదనపు లైన్ల ఏర్పాటు విషయమై అధికారులతో చర్చించారు. ఆయన వెంట గుంటూరు రైల్వే డీఆర్వో శ్రీనివాస్, ఇతర రైల్వే అధికారులు ఉన్నారు.