పెరుగుతూ.. తగ్గుతూ


Sat,September 14, 2019 04:28 AM

-నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
-ఉదయం 26, రాత్రి 19 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల
-ప్రాజెక్టు నీటిమట్టం 589 అడుగులు
-శ్రీశైలానికి 2,95,556 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నందికొండ : ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం ఉదయం నుంచి 26 గేట్లతో నీటి విడుదల కొనసాగించిన అధికారులు రాత్రి ఇన్‌ఫ్లో తగ్గడంతో 19 గేట్ల నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. అల్మట్టి, నారాయణ పూర్, జూరాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడ ంతో దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు అదే స్థాయిలో ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులు అన్ని పూర్తి సామర్థ్యం వరకు నీటితో నిండి ఉండడంతో వచ్చి న ఇన్‌ఫ్లోను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంకు 2,95,556 క్యూసెక్కల నీరు వస్తుండడంతో దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు 2,55,238 క్యూసెకుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో డ్యాం 19 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వస్తున్న వరద నీటితో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతు, ఎడమ, కుడి, వరద, ఎస్‌ఎల్‌బీసీ కాల్వ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.

నీటి సమాచారం
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద 310.8498 టీఎంసీల నీరు శుక్రవారం నిల్వ ఉంది. సాగర్ జలాశయం నుంచి క్రస్ట్ గేట్ల నుంచి 3,38,238 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 31508 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8929 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 10633 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, డీటీ గేట్సు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 884.50 అడుగుల వద్ద 212.9123 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు ఎగువ నుంచి 2,95,556 క్యూసెక్కుల నీరు వస్తోంది.

తప్పని పరిస్థితిలో 26వ గేటు ఎత్తివేత
ఈ ఏడాది అగస్టులో పూర్తి స్థాయిలో వరద వచ్చినప్పుడు 26 గేట్ల ద్వారా నీటి విడుదల అనంతరం గేట్లు బంద్ చేసినప్పుడు 26 నెంబర్ గేటు రబ్బర్ సీల్ పోవడంతో నీరు లీకేజీ భారీ స్థాయిలో కొనసాగింది. ఎన్నెస్పీ అధికారులు ఇసుక సంచులు అడ్డుగా వేసి నీటి లీకేజీని కొంత వరకు నియంత్రించారు. తిరిగి శుక్రవారం ఇన్‌ఫ్లో అధికంగా ఉండి గేట్ల పై నుంచి జాలు వారుతుండడంతో తప్పనిసరిగా 26 నెంబర్ గేటును ఎత్తారు. డ్యాం నిర్వాహణపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేయడంతో ప్రకృతి వైపరీత్యాలతో గాకుండా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లనే డ్యాంకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని విశ్రాంత ఇంజినీర్లు వాపోతున్నారు.

టెయిల్‌పాండ్ 16 గేట్ల ఎత్తివేత
అడవిదేవులపల్లి : మండలకేంద్రానికి చేరువలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు శుక్రవారం నాగార్జునసాగర్ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వాటర్ వస్తుంది. దీంతో టెయిల్‌పాండ్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లు 4మీటర్ల మేర ఎత్తి 4లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. టెయిల్‌పాండ్ నీటి నిల్వ సామర్థ్యం సమారు 8 టీఎంసీలని ఎస్‌ఈ శేషారెడ్డి తెలిపారు. ప్రస్తుతం 6 టీఎంసీలు నిల్వ ఉందన్నారు.

మూసీకి 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి : మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో సాయంత్రం వరకు ప్రాజెక్టు నీటిమట్టం 630.17(1.42 టీఎంసీలు)అడుగులు. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు). కుడి, ఎడమ కాలువలకు 225 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పులిచింతల 24 గేట్లు ఎత్తివేత
చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 174.932 (45.6673 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 4,29,690 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. పులిచింతల ప్రాజెక్టు మొత్తం గేట్లు 24, కాగా 10 గేట్ల నుంచి 4,06,020 క్యూసెక్కుల నీరు, గేట్ల లీకేజీల ద్వారా 1000 క్యూసెక్కుల నీరు, తెలంగాణ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా 19000 క్యూసెక్కుల నీరు, మొత్తం 4,26,020 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో విడుదలవుతుంది.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...