ఇంటింటికీ వైద్య బృందం


Thu,August 22, 2019 01:26 AM

-ఆరోగ్య తెలంగాణ దిశగా మరో కార్యక్రమం
-ప్రతీ ఒక్కరికి రోగ నిర్ధారణ పరీక్షలు
-హెల్త్ ప్రొఫైల్ ద్వారా మందుల పంపిణీ
-ప్రతి బృందం ప్రతీరోజు పది ఇళ్లలో పరీక్షలు

(నీలగిరి)రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు మరో అడుగు ముందుకేసింది. జిల్లాలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సంకల్పించింది. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు నాన్ కమ్యునికబుల్ డిసీజ్ (అసంక్రమిత వ్యాధి)ని గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించేవారు. తాజాగా కమ్యునికబుల్ డిసీజ్(అంటువ్యాధి)లను గుర్తించేందుకు యూనివర్సల్ హెల్తు స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు ఏప్రిల్‌లో ఈ కార్యక్రమం ప్రారంభించి బీపీ, షుగర్, క్యాన్సర్ లక్షణాలు గుర్తించారు. వీరికి ఆరోగ్య కార్డులను అందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఏఎన్‌ఎంలు, ఆశాలు నిర్వహించిన ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లకు భిన్నంగా యూనివర్సల్ హెల్తు స్క్రీనింగ్‌లలో పీహెచ్‌సీ, అంగన్‌వాడీ, ఆశా, మలేరియా, టీబీ, లెప్రసీ తదితర ప్రభుత్వ విభాగాల సిబ్బంది పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లలో 30 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, యూనివర్సల్ స్క్రీనింగ్‌లో 2 నుంచి 70 ఏళ్ల వారికి పరీక్షలు నిర్వహించి సరికొత్త ఆరోగ్య విప్లవానికి నాంది పలుకనున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమై మహాత్మగాంధీ జయంతి (అక్టోబర్2)లోగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం మేరకు బస్తీ దవాఖానలు, స్పెషలిస్టు అవుట్‌రిచ్ క్యాంపులు, పాఠశాలలో ఆర్బీస్కే వైద్య సేవలు, పీహెచ్‌సీలలో ఈవినింగ్ క్లినిక్‌లతో సంపూర్ణ ఆరోగ్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కంటి వెలుగు మెగా వైద్య శిబిరాల్లో లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా యూనివర్సల్ హెల్తు స్కీమ్‌ల ద్వారా ప్రజల ఆరోగ్య వివరాలను (హెల్తు ప్రొపైల్)ను సిద్ధం చేసి ప్రతి ఒక్కరికి హెల్తుకార్డులు ఇవ్వనుంది.

జిల్లాలో 1680 టీంల ఏర్పాటు....
జిల్లాలో 2 నుంచి 70 ఏళ్లకు పైబడిన వారికి యూనివర్సిల్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 16,18,416 జనాభా ఉండగా 4,37,400 గృహాలున్నాయి. ఇందుకుగాను 1680 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్‌లో ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉంటారు. స్త్రీలల్లో అంగన్‌వాడీ టీచర్, ఆశ వర్కర్ కానీ ఉంటారు. పురుషులలో ఆశా, అంగన్‌వాడీల భర్తలుకానీ, అయా పరిధిలోని యువత లేదా స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకు వచ్చే వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకు గాను వారికి రోజుకు రూ.75 చెల్లించనున్నారు. ప్రతి టీమ్ రోజుకు 10 ఇండ్లను తిరిగి హెల్త్ విషయాలు అన్ని సేకరించి నివేదికను సమర్పించనున్నారు.

భూ రికార్డుల ప్రక్షాళన స్ఫూర్తితో...
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 25 వరకు 100 రోజులపాటు నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళనను స్పూర్తిగా తీసుకుని ప్రతి గ్రామం, తండా, గూడాల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి మనిషిని స్క్రీనింగ్ చేసి ఆరోగ్య సమాచారాన్ని అన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఈ స్క్రీనింగ్‌లో మనిషి బరువు, ఎత్తు, వ్యక్తిగత వివరాలు, బీపీ, మధుమేహం, నోటిక్యాన్సర్, పక్షవాతం, గుండె రోగాలకు సంబంధించిన స్క్రీనింగ్ చేస్తారు. అలాగే స్క్రీనింగ్‌లో భాగంగా ఇద్దరు ఏఎన్‌ఎంలు బ్రెస్టు లంప్, సర్వేకల్ (గర్భకోశ) పరీక్షలు నిర్వహించి ఒక వేళ సమస్య ఉంటే ఎలా ఉంటుందనేది వీడియో ద్వారా బాధితులకు చూపిస్తారు. రక్తపోటు మధుమేహం ఉన్న వారిని పీహెచ్‌సీ డాక్టర్ల వద్దకు పంపి వీరికి భోజనానికి ముందు తర్వాత పరీక్షలు చేస్తారు. మధుమేహం, రక్తపోటు ఉందని నిర్ధారణ అయితే ఆ రోజు మందులు అందించి, మరుసటి నెల నుంచి 104 వాహనం ద్వారా మందులు పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్రెస్టు క్యాన్సర్, సర్వైకల్, నోటి క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం ఉన్నాయని గుర్తించినట్లయితే వీరిని పీహెచ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి డాక్టర్ వద్ద పరీక్షలు నిర్వహిస్తారు.

పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్ పరీక్షలు నిర్వహించిన తర్వాత రోగ నిర్ధారణ అయితే స్పెషాలిటీ సేవలు అందించి వ్యాధులను నయం చేసేందుకు కృషి చేయనున్నారు. అవసరమైతే దగ్గరలో ఉన్న రిఫరల్ దవాఖానాలకు వాహనాన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందేలా చూడనున్నారు. రక్తపోటు, మదుమేహం ఉన్న వారికి వాహన సౌకర్యం ఉంటుందని అధికారులు తెలిపారు. స్పెషలిస్టులు పరీక్షలు చేసి వైద్యం అందించేందుకు ఎంఎన్‌టీ క్యాన్సర్ దవాఖానాకు తీసుకెళ్లి పూర్తి స్థాయి వైద్యం అందించి వ్యాధి నయం అయ్యేంత వరకు ప్రభుత్వ పరంగా పూర్తి బాధ్యత వహించనున్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...