చెరువులన్నీ నింపేలా..


Thu,August 15, 2019 03:35 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లక్షలాది రైతుల ఆశల సౌధం నాగార్జునసాగర్ దాదాపుగా పూర్తి స్థాయిలో నిండింది. ఎగువ నుంచి భారీగా కృష్ణమ్మ వరద ఇంకా సాగర్ తలుపుల నుంచి దూకి టెయిల్‌పాండ్, పులిచింతల నింపి సముద్రం దిశగా పయనిస్తోంది. మరోవైపు జిల్లాలో సరిపడా వర్షపాతం నమోదు కాలేదు. సాగర్ పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతున్నా.. జిల్లాలో ఎక్కడా చెరువులు మాత్రం నిండలేదు. దీంతో కాల్వల పరిధిలోని చెరువులన్నీ సాగర్ నీటితో నిండుతాయని ఇప్పుడు రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది. ఈ నెల 9నుంచి శ్రీశైలం క్రస్ట్ గేట్ల ద్వారా సాగర్‌కు ఇన్ ఫ్లో ప్రారంభమైంది. రెండ్రోజుల్లోనే వరద ఉధృతి విస్తృతంగా పెరిగింది. నీళ్లున్నపుడే ప్రతీ చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలనే ఆశయంతో పని చేస్తున్న సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు.. ఈ నెల 11నే సాగర్ ఎడమ కాల్వతోపాటు ఏఎమ్మార్పీ హై లెవెల్ (ప్రధాన) కాల్వ, లో లెవెల్ (వరద) కాల్వలకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. మొదటి రోజు కొంత తక్కువస్థాయిలో నీటిని విడుదల చేసినా.. ప్రస్తుతం 3కాల్వలకూ సాధ్యమైనంత మేర నీటి విడుదల కొనసాగుతోంది.

ఏఎమ్మార్పీ ఎగువకాల్వకు 1400క్యూసెక్కులు...
పీఏపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కట్టంగూర్ మండలం ఆయిటిపాముల వరకు 136కిలోమీటర్ల పొడవున్న ఈ ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ పరిధిలో 55డిస్ట్రిబ్యూటరీలున్నాయి. ప్రస్తుతం పుట్టంగండిలో 4 మోటార్ల ద్వారా తీసుకుంటున్న 2400క్యూసెక్కుల నీటిలో 1400క్యూసెక్కులు ఈ కాల్వకు విడుదల చేస్తున్నారు. మిగిలిన నీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్‌తోపాటు మిషన్ భగీరథ పథకానికి వెళ్తున్నాయి. ఈ నెల 9నుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు నీటి విడుదల జరుగుతున్నా.. 13న సాయంత్రానికి నల్లగొండ సమీపంలోని ఉదయ సముద్రం రిజర్వాయర్‌కు వరద చేరింది. మార్గమధ్యలో కనగల్, జీ యడవెల్లితోపాటు పలు చెరువులకు నీటి విడుదల జరుగుతోంది. 1.5టీఎంసీల సామర్థ్యం కలిగిన పానగల్లు ఉదయ సముద్రంలో ప్రస్తుతం 0.4టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం ఉదయ సముద్రానికి సుమారు 500క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. నిండటానికి 15రోజుల సమయం పడుతుందని అంచనా. పానగల్ పూర్తి స్థాయిలో నిండిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు నీటి విడుదల చేయాలని ఇంజినీర్లు ఆలోచిస్తున్నారు. ఎస్సెల్బీసీలో భాగంగా నిర్మించిన ఏఎమ్మార్పీ పరిధిలో మొత్తం 2.2లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. కాల్వ పరిధిలోని చెరువులతోపాటు నేరుగా సాగు నీటిని ఆన్ అండ్ పద్ధతిలో 125రోజుల పాటు విడుదల చేసేందుకు ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో ఈసారి రెండు పంటలకూ ఢోకా ఉండకుండా నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని.. చెరువులన్నీ పూర్తిస్థాయిలో నింపాలని ఎగువ కాల్వ రైతులు కోరుతున్నారు.

గ్రావిటీ ద్వారా ఏఎమ్మార్పీ దిగువ కాల్వకు నీటి విడుదల
ఏఎమ్మార్పీ దిగువ కాల్వగా పిలుచుకునే వరద కాల్వకు పెద్దవూర మండలం పుల్యాతండా నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ నీటిమట్టం 575అడుగుల కంటే పైన ఉన్నప్పుడు గ్రావిటీ ద్వారా ఈ కాల్వకు నీటిని తీసుకునే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వ చొరవతో ఈ నెల 9 నుంచే ఇక్కడ కూడా నీటి విడుదల మొదలైంది. అయితే ముందుగా వరద వస్తుందని ఊహించని యంత్రాంగం రెండో మోటారును సిద్ధం చేయలేకపోయింది. ఫలితంగా ఈ నెల 9నుంచి 13వరకు ఒక్క మోటార్ ద్వారా 300క్యూసెక్కులు మాత్రమే కాల్వకు విడుదలయ్యాయి. తాజాగా బుధవారం ఉదయం నుంచి సాగర్ నీటి మట్టం 575అడుగులు దాటడంతో మోటార్‌ను నిలిపేసి గ్రావిటీ ద్వారా 600క్యూసెక్కుల నీటిని కాల్వకు విడుదల చేస్తున్నారు. పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, మాడ్గులపల్లి, వేములపల్లి మండలాల మీదుగా 85.3కిలోమీటర్లు ప్రవహించే ఈకాల్వ పరిధిలో మొత్తం 42డిస్ట్రిబ్యూటరీ కాల్వలతోపాటు 27ప్రధాన చెరువులున్నాయి. వాటి దిగువన మరో 90వరకు గొలుసుకట్టు చెరువులూ ఉన్నాయి. ప్రత్యక్షంగా 50వేల ఎకరాలు.. చెరువుల కింద 30వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ముందుగా చెరువులన్నీ నింపేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం నిడమనూరు మండలంలోని వెంకటాపురం, ఎర్రబెల్లి గ్రామాల వరకు వరద కాల్వ ప్రవాహం చేరుకుంది.

నీటి విడుదలను పెంచి రైతులకు లబ్ధి చేకూర్చాలి
వరద కాల్వ విడుదల చేస్తున్న నీటిని పెంచి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు చొరవ చూపాలి. నాగార్జునసాగర్ జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్నా నేటికీ వరద కాల్వకు నీటి విడుదల ఆశాజనకంగా లేదు. 400 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తుండటంతో చెరువులు నిండటం ఆలస్యమవుతుంది. మూడ్రోజులుగా నీటిని విడుదల చేసినా ఎర్రబెల్లి చెరువుకు వరద కాల్వ నీరు చేరుకోలేదు.
- తాటి సత్యపాల్, రైతు, ఎర్రబెల్లి, నిడమనూరు

చెరువులన్నీ నింపేందుకు కృషి చేస్తున్నాం...
నాగార్జునసాగర్ పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో ఏఎమ్మార్పీ హై లెవెల్, లో లెవెల్ కాల్వల పరిధిలో ప్రతి చెరువునూ నింపేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం హై లెవెల్ కాల్వకు మొత్తం 1400క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. ఉదయ సముద్రం రిజర్వాయర్‌తోపాటు మంచి నీటి చెరువులు జీ.యడవెల్లి, కనగల్ ఇప్పటికే నిండుతున్నాయి. సాగర్ నీటిమట్టం 575అడుగులు దాటడంతో.. లో లెవెల్ కాల్వకు బుధవారం ఉదయం నుంచి మోటార్లు కాకుండా నేరుగా గ్రావిటీ ద్వారా 600క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నాం. అంతకు ముందు ఒక మోటార్ ద్వారా 300క్యూసెక్కులు విడుదల చేశాం. వరద ఉధృతిని తట్టుకునే విధంగా కాల్వల స్థితిగతులను బట్టి నీటిని ఇంకా ఎక్కువగా విడుదల చేసే అంశాలు పరిశీలిస్తున్నాం.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...