తెలంగాణ ఉద్యమంలా మొక్కలు నాటాలి


Wed,August 14, 2019 02:09 AM

-మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
సూర్యాపేట రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొని తెలంగాణ ఉద్యమంలా మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట గ్రామపరిధిలోని మిషన్ భగీరధ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటులో రాజ్యసభసభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికయుగంధర్‌రావు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి 5వ విడత హరితహారంలో భాగంగా ఒక్కరోజులో లక్ష 50వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం 33శాతం అటవీ భూమి నమోదై ఉందని, తెలంగాణ రాష్ట్రంలో 26శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని, అందులో సూర్యాపేటజిల్లాలో 2.4 శాతం అటవీ భూమి ఉందన్నారు. అటవీ విస్తీర్ణంలో 10రెట్లు తక్కువగా ఉందని, పేరుకు మాత్రమే అటవీ భూమిగా ఉన్నప్పటికి చిన్నచిన్న చెట్లు తప్ప పెద్దచెట్లు ఎక్కడ కనిపించడం లేదన్నారు. అటవీ విస్తీర్ణంలో చెట్ల పెంపకం లేనందున వాతావరణంలో అనేకమార్పులు వస్తున్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖ సమన్వయంతో హరితహరం కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఒక యజ్ఞంలా చేపట్టారన్నారు. ఈ తెలంగాణకు హరితహరం మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోని ఇండ్లలో, ఆరుబయట ప్రాంతాల్లో మొక్కలు నాటాలని విద్యార్థులకు, రైతులకు సూచించారు. ప్రతిఒక్కరూ నాటిన మొక్కలు వదిలేయకుండా వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. ప్రతి రోడ్డు మీద మొక్కలను పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో చెట్లను ఎక్కువగా పెంచితే వర్షాలు సరైన సమయంలో కురుస్తాయని, భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించాలన్నారు. జిల్లాఅంతటా మొక్కలు నాటి పచ్చని వాతావరణం ఏర్పాటుచేసి జిల్లాను ఆకుపచ్చ జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇమాంపేట, రాజానాయక్‌తండా సర్పంచులు పాముల ఉపేందర్, లునావత్ అశోక్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమయ్‌కుమార్, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎఫ్‌ఓ ముకుందరెడ్డి, ఆర్డిఓ మోహన్‌రావు, మిషన్ భగీరధ ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్‌చైర్మన్ గోపగాని వెంకటనారాణగౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్‌పిటిసి జీడి భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, ఎంపీటీసీలు కిరణ్, శాంతబాయి, సర్పంచులు చింతలపాటి మౌనిక, సూర్యానాయక్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...