నాగార్జున సాగర్‌కు పర్యాటక శోభ


Wed,August 14, 2019 02:08 AM

- 575 అడుగుల వద్ద సాగర్ నీటిమట్టం
- నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు
- రిజర్వాయర్‌కు 5,35,931 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- శ్రీశైలం ప్రాజెక్టుకు 9,19,260 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నందికొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 26 క్రస్ట్ గేట్లను 27 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 8,14,931 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో క్రస్ట్ గేట్ల ద్వారా 4,92,048 క్యూసెక్కులు దిగున ఉన్న టెయిల్‌పాండ్, పులిచింతల ప్రాజెక్ట్‌లకు విడుదల చేస్తున్నారు. ముంపునకు గురయ్యే గ్రామాలను మందస్తు హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలను అధికారులు చేపడుతున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వస్తున్న వరద నీటితో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ, ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు నీటినందిస్తున్నారు.

నీటి సమాచారం
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 575.00 అడుగుల వద్ద 269.1200 టీఎంసీల నీరు మంగళవారం వరకు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా 4,92,048 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32,844 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8,629 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, డీటీ గేట్లు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. కుడికాల్వ ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 5,36,231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 879.40 అడుగుల వద్ద 185.1350 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజుక్టుకు ఎగువ నుంచి 9,19,260 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది.

పర్యాటకులు సందడి
డ్యాంపై నుంచి కృష్ణమ్మ పరువళ్లను చూడటానికి నాగార్జునసాగర్‌కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మంగళవారం నాగార్జునసాగర్‌లోని డ్యాం, ప్రధాన జలవిద్యుత్ కేంద్ర పరిసరాలు, హిల్‌కాలనీ సత్యనారాయణ స్వామి దేవాలయం నుంచి కొత్త బ్రిడ్జీ వరకు రోడ్లు పర్యాటకులతో నిండిపోయాయి. నది తీరంలో క్రస్ట్ గేట్ల ఎదుట ఎగిసి పడుతున్న నీటి ఎదుట సేల్ఫీలు దిగి ఆనందంగా గడిపారు. పర్యాటకులు భారీగా రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

628.50 అడుగులకు మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 628.50 (1.20 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల ఉంచి 240 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు. కాగా ప్రాజెక్టు నుంచి ఎలాంటి అవుట్ ఫ్లో లేదు.

159.283 అడుగుల వద్ద పులిచింతల
చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 159.283 (24.9248 టీఎంసీలు) అడుగులకు చేరింది. ఎగువ నుంచి 5,40,674 క్యూసెక్కుల నీరు పులిచింతలకు ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు మొత్తం 24 గేట్లు ఉండగా 19 గేట్లు ఎత్తి 4,06,600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...