ప్రతీ నీటి బొట్టు సద్వినియోగం


Tue,August 13, 2019 02:20 AM

-సీఎం కేసీఆర్ ప్రణాళికలు అద్వితీయం
-లిఫ్టుకింది భూములకు సాగునీరు
-నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య
-ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ఎత్తి నీటి విడుదల

నందికొండ: వర్షపు నీటిని ఒడిసి పట్టి ప్రతీ నీటి బొట్టును ఆయకట్టు రైతుల సాగుకు, ప్రజల తాగునీటికి ఏవిధంగా ఉపయోగించాలో సీఎం కేసీఆర్‌కు తెలుసునని.. వర్షాలు ఎప్పుడు రాబోతున్నాయి.. వచ్చిన వర్షం తో ఏ ప్రాజెక్టులో ఎంత నీరు నిల్వ అవుతుంది.. ఆ నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంలో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ప్రత్యేక ప్రణాళికలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం క్రస్ట్ గేట్ల వద్ద జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ అనురాధ సుంధర్‌రెడ్డి, డ్యాం సీఈ నర్సింహ, ఎస్‌ఈ మధుసూదన్‌లతో కలిసి పూజలు నిర్వహించారు. క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2009 కంటే వరదలు ఈ సారి భారీగా వస్తున్నాయని, వరదల సమయంలో గతంలో నాయకులకు ప్రణాళికలు లేకపోవడంతో రైతులు ఏడ్చేవారని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినంక పరిస్థితి మారిందన్నారు.

సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలతో మంత్రుల పర్యవేక్షణలతో వస్తున్న వరదలను అంచనా వేసుకుంటూ ప్రాజెక్టుల్లోకి నీరు మళ్లిస్తూ ప్రతీ నీటి బొట్టు రైతులకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. రెండు రాష్ర్టాల పరస్పర సహకారంతో నీటిని వినియోగించుకునే విధంగా సీఎం కేసీఆర్ చొరవ చూపడంతో ప్రతీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి రైతుల పంటలకు నీరు అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉభయ తెలుగు రాష్ర్టాలు స్నేహ పూర్వక వాతావరణంలో వస్తున్న వరద నీరును వినియోగించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కృష్ణమ్మ కరుణించి పరువళ్లు తొక్కుతున్నందుకు రైతులు ఆనందంతో ఉన్నారన్నారు. శ్రీశైలం ఎగువన ఉన్న డ్యాంల నుంచి భారీగా వరద నీరు సాగర్‌కు వచ్చి చేరుతుండడంతో డ్యాం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నందున్న వర్షాకాలం మొదటి పంటకు నీరు అందించే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఎడమకాల్వకు నీటి విడుదలను చే సిందన్నారు.

గత మూడేళ్లుగా నీటిని పొదుపుగా వాడుకోవడంలో తెలంగాణ రైతాంగంలో చైతన్యం వచ్చిందన్నారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ, ఏఎమ్మార్పీ, లోలెవెల్, ప్రతీ లిఫ్ట్ కింద ఉన్న పొలాలకు నీరు అందిస్తున్నామని, రైతులంతా పొలాలను పండించుకోవాలని, ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు.డ్యాం సీఈ నర్సింహ మాట్లాడుతూ కృష్ణా పరివాహక ప్రాంతాలలో నదులు పూర్తిగా నిండాయని, జూరాలకు, శ్రీశైలంకు భారీగా వరద వస్తుందని, అదే స్థాయిలో నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతుందన్నారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 557 వద్ద 226 టీఎంసీలు నీరు నిల్వ ఉండగానే పై నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు.

క్రస్ట్ గేట్ల ద్వారా ప్రారంభంలో 5వేల క్యూసెక్కులతో ప్రారంభించి 2 లక్షల క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, వస్తున్న వరద ఆధారంగా క్రస్ట్ గేట్లను పెంచడం, తగ్గించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ రాంచంద్రనాయక్, ఎంపీపీ భగవాన్‌నాయక్, టీఆర్‌ఎస్ నందికొండ మున్సిపాలిటీ ఇన్‌చార్జి కర్న బ్రహ్మానందరెడ్డి, బత్తుల సత్యనారాయణ, ఇర్ల రామకృష్ణ, సుందర్‌రెడ్డి, దినేష్‌నాయక్, జటావత్ రవినాయక్, కాటుకృష్ణ, రమేష్‌జీ, ఆదాస్ విక్రమ్, ఎన్నెస్పీ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...