నేడు సాగర్ క్రస్ట్ గేట్ల ఎత్తివేత


Mon,August 12, 2019 01:34 AM

నందికొండ : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు గంట గంటకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సోమవారం ఉదయం ఎన్నెస్పీ అధికారులు డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడదల చేయడానికి నిర్ణయించారు. క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల అవుతున్నందున లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు కోరారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 10 క్రస్ట్ గేట్లను 33అడుగుల మేరకు ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 8,18,359 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్ రిజర్వాయర్‌కు 64 టీఎంసీల నీరు వచ్చి చేరుతుండడంతో రెండ్రోజులలో పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలకు చేరుకోనుంది. నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో డ్యాం భద్రత దృష్ట్యా వరద ఉధృతిని తగ్గించడానికి సాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా సోమవారం 50వేల నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ఎన్నెస్పీ సీఈ నర్సింహ తెలిపారు. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి 846949 కూసెక్కుల నీరు శ్రీశైలంకు వచ్చి చేరుతుండడంతో అదే స్థాయిలో నీటిని నాగార్జునసాగర్ రిజర్వాయర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువన కృష్ణాడెల్టాకు విడుదల చేయనున్నారు. శనివారం నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం 525 అడుగులు ఉండగా ఆదివారం రాత్రివరకు 549 అడుగులు చేరుకోవడంతో ఒక్కరోజులో 24 అడుగుల మేరకు రిజర్వాయర్ నీటిమట్టం పెరిగింది. రిజర్వాయర్‌లో 549 అడుగుల వద్ద క్రస్ట్ గేట్లకు నీరు చేరింది. ప్రస్తుతం 549 అడుగులు ఉన్నందున రేపు ఉదయంలోపు క్రస్ట్ గేట్లకు సాగర్ నీటి మట్టం చేరనున్నడంతో నీటి విడుదలకు ఎన్నెస్పీ అధికారులు సిద్ధమయ్యారు.

నీటి సమాచారం
సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామ ర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 549 అడుగుల వద్ద 207.5790 టీఎంసీల నీరు ఆదివారం వరకు నిల్వ ఉంది. సాగర్ జలాశయం నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,587 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 1224 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా తాగు నీటికోసం 2419 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2000 క్యూసెక్కులు, డీటి గేట్సు(డైవర్షన్ టన్నల్) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 39 240 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 881.00 అడుగుల వద్ద 205.2258 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...