యాదాద్రిలో నిత్య పూజల కోలాహలం


Sun,August 11, 2019 12:53 AM

యాదాద్రి-భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శనివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. యాదాద్రిలో నిత్య పూజల సందడి కొనసాగుతుంది. పలు ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. శ్రీవారి ధర్మదర్శనాలలో 2 గంటలు, ప్రత్యేక దర్శనాలలో గంట సమయం పట్టింది. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం 3గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. స్వామివారి నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామివారికి జరిగిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. వ్రత మండపంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

మొదలైన పవిత్రోత్సవాలు
ఆలయంలో పవిత్రోత్సవాలకు అర్చకులు శ్రీకారం పలికారు. ఏడాది పాటునా జరిగే అంటూ ముట్టులతో ఏర్పడే మలినాన్ని తొలగించేందుకు ప్రతీ ఏటా పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. యాదాద్రిలో మరియు పాత గుట్టలో ఏక కాలంలో పవిత్రోత్సవాలకు శ్రీకారం పలికారు. మూడ్రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈఓ గీత తెలిపారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బీ.నర్సింహమూర్తి, ఏఈఓ దోర్భల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

16న సామూహిక వరలక్ష్మీవ్రత పూజలు
యాదాద్రి ఆలయంలోఈనెల 16న శుక్రవారం సామూహిక ఉచిత వరలక్ష్మీవ్రత పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. పూజా సామగ్రి కూడా ఆలయం పక్షాన ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పాల్గొనదల్చిన వారు ఈ నెల 15న సాయంత్రం 5 గంటల వరకు తమ పేర్లను దేవస్థానంలోని శాశ్వతపూజలు, అన్నదానం విభాగం కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఈఓ కోరారు. శ్రీసత్యనారాయణస్వామివారి వత్ర మండపంలో వ్రతపూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

శ్రీవారికి రూ.14,82,326 ఆదాయం
శ్రీవారి ఆలయానికి రూ.14,82,326ఆదాయం సమకూరినట్లు ఆదాయ శాఖాధికారులు తెలిపారు. ప్రసాద విక్రయాలతో రూ.4,09,200, ప్రధాన బుకింగ్‌తో 4,72,160, వ్రత పూజలతో శ్రీవారి ఖజానాకు రూ.1,81,500, ఆదాయం సమకూరింది. గదులు విచారణ శాఖతో రూ. 90,060 ఆదాయం సమకూరిందని చెప్పారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...