సాగర్‌కు తరలివస్తున్న కృష్ణమ్మ


Sat,August 10, 2019 01:41 AM

- శ్రీశైలం నుంచి సాగర్ వైపు పెరిగిన కృష్ణమ్మ ప్రవాహం
- పవర్ హౌజ్‌తోపాటు క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల
-నాగార్జునసాగర్ చేరుతున్న 1,77,911క్యూసెక్కుల వరద
-శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 4.7లక్షల క్యూసెక్కులు
-వరద కొనసాగితే వారం రోజుల్లోనే సాగర్ నిండే అవకాశం
నందికొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగు పరుగున తరలివస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు 880 అడుగులకు చేరడంతో శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు నాలుగు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 469000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా రాబోయే రోజుల్లో మరిన్ని గేట్లు తెరిచి నీటిని సాగర్‌కు విడుదల చేసే అవకాశం ఉంది. వారం రోజులుగా శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 517 అడుగులకు చేరుకుంది.

ఆయకట్టు రైతుల్లో ఆనందం
ఈ సంవత్సరం నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉండగా కుడి, ఎడమకాల్వ ద్వారా పంట పొలాలకు, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కుడికాల్వ పరిధిలోని 10,37,796 లక్షల ఎకరాలకు, ఎడమ కాల్వ పరిధిలోని 11,74,874 ఎకరాలకు రెండు సీజన్లకు సాగు నీరు అందనున్నది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టు నీటిమట్టం 517 అడుగులు
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 517.10 అడుగుల వద్ద 144.0402 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి కుడికాల్వ ద్వారా తాగు నీటికోసం 4469 క్యూసెక్కులు, డీటీ గేట్లు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. డ్యాం ప్రధాన జల విద్యుత్ కేంద్రం, ఎడమకాల్వ, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 880.80 అడుగుల వద్ద 192.5300 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...