అభివృద్ధి పండుగ..


Thu,July 11, 2019 03:56 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : వరుస ఎన్నికల అనంతరం నల్లగొండలో అభివృద్ధి పండుగకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. శాసన సభ ఎన్నికల నుంచి ప్రాదేశిక ఎన్నికల వరకు కోడ్ నేపథ్యంలో నిలిచిపోయిన అభివృద్ధ్ది పనులను నేడు జిల్లా కేంద్రంలో ప్రారంభించనున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున ఆ లోపే ఈ పనులకు ము హూర్తం పెట్టారు. ఓ వైపు అమృత్-భగీరథ పనులు,మంత్రి మ రో వైపు మున్సిపల్ పట్టణ ఆధునీకరణ, సీసీరోడ్ల నిర్మా ణాలకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా మున్సిపల్ పరిధిలో రూ. 160 కోట్లతో నేడు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనులు జరుగనున్నాయి.

రూ.116 కోట్లతో అమృత్-భగీరథ పనులు..
నల్లగొండ పట్టణంలో ప్రతి వ్యక్తికీ నిత్యం 135 లీటర్ల తాగునీటిని ఇవ్వాలనే ఉద్ధ్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత్ పనులు 2016లో ప్రారంభించారు. రూ. 116 కోట్లతో ఈ పనులు ప్రారంభం కాగా ఇప్పటి వరకు రిజర్వాయర్ల పనులు 80 శాతం, పైపులైన్ల పనులు 90 శాతం పూర్తి కాగా నేడు వాటిని ప్రారంభోత్సవం చేయనున్నారు. పట్టణానికి తాగునీరు అందించేందుకు సంప్, పంపుహౌస్‌తో పాటు ఒకటి ఈఎల్‌బీఆర్, 2 జీఎల్‌ఎస్‌ఆర్, 6 ఈఎల్‌ఎస్‌ఆర్ ట్యాంకులను నిర్మించారు. ఈ పనుల్లో 80 శాతం పూర్తి చేసిన అధికారులు ఈ నెల చివరి నాటికి పూర్తి స్థాయిలో చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక 333.69 కి.మీ. పైపులైన్లకు 313 కి.మీ. పైపులైన్ పూర్తయింది. వీటికి నేడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు.

తాగునీటి సమస్య లేకుండా చర్యలు..
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మరో 15 ఏళ్ల వరకు తాగునీటి సమస్య లేకుండా డిజైన్ చేసిన అధికారులు ఆ దిశగా నీరందిస్తున్నారు.ఈ నెల చివరి నాటికి పనులు పూర్తి కానుండగా ఆగస్టు 1 నుంచి 48 వార్డులకు నీరందనుంది.
గతంలో 17.5 ఎంఎల్‌డీ తాగునీరును పట్టణ వ్యా ప్తంగా సరఫరా చేయగా ఇటీవల ప్యారలాల్ పైపులైన్‌తో మరో 10 ఎంఎల్‌డీ నీరు అధికంగా సరఫరా చేస్తుండగా నేటితో మరో రెండు ఎంఎల్‌డీ,ఈ నెల చివరి నాటికి 8 ఎంఎల్‌డీ నీటిని ఇవ్వనున్నారు. పట్టణ జనాభా సుమారు 2 లక్షలు కాగా ఈ నీటితో 2.70 లక్షల మందికి 135 లీ. చొప్పున రెగ్యులర్‌గా ఇవ్వవచ్చు. ఇందుకు గాను పానగల్‌లో మిషన్ భగీరథ నిధులతో 650 కి.లీటర్ల సంప్‌ను నిర్మించగా అమృత్ నిధులతో నిర్మించినటువంటి పంప్ హౌజ్‌కు సంపు నుంచి పంపించనున్నారు. అక్కడ నుంచి నల్లగొండ పట్టణానికి నీటిని తీసుకొచ్చి ఎల్‌ఎస్‌గుట్ట సమీపంలో నిర్మించిన ఎలివేటెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఎత్తిపోసి అక్కడ నుంచి కాపురాల గుట్ట ఆనంద్‌నగర్, ఐటీఐ, కోర్టు, ఎల్‌ఎస్‌గుట్టలో నిర్మించిన సర్వీస్ రిజర్వాయర్లకు పం పించి పట్టణానికి సరఫరా చేయనున్నా రు. అదే విధంగా బోడగుట్టతో పాటు అన్నేశ్వరం గుట్ట వద్ద 1900 కి.లీటర్ల జీఎల్‌ఎస్‌ఆర్ ట్యాంకులనునిర్మించారు.

పట్టణ ఆధునీకరణ కోసం మరో రూ.44 కోట్లు
నల్లగొండ పట్టణం రూపురేఖలు మార్చి ఆదునీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 100 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో ఆ నిధులతో పట్టణ అభివృద్ధ్దికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. రూ. 28.60 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో పట్టణాన్ని ఆధునీకరించనున్నారు. బస్టాండ్ సమీపంలోని సుభాష్ విగ్రహం నుంచి పెద్దబండ నుంచి కలెక్టరేట్ వరకు, డీఈవో ఆఫీస్ నుంచి హ్యాపిహోమ్స్, పానగల్ విద్యాభారతి స్కూల్ నుంచి అద్దంకి బైపాస్ వరకు, ఎస్‌ఎల్‌ఎన్‌స్వామి కాలనీ నుంచి మునుగోడు ఈద్గా క్రాస్‌రోడ్డు వరకు మెయిన్‌రోడ్స్‌ను విస్తరించి పుట్‌పాత్‌లు వేసి సెంట్రల్ లైటింగ్ అమర్చనున్నారు. అదే విధంగా క్లాక్‌టవర్, రామగిరి సెంటర్, బస్టాండ్ సెంటర్, డీఈఓ ఆఫీస్ జంక్షన్లను అభివృద్ధ్ది పరిచేందుకు ఈ నిధులను కేటాయించనున్నారు. అదే విధంగా పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో రూ. 16 కోట్లతో ఎస్‌డీఎఫ్ నిధులతో సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది.

ప్రతి ఒక్కరికీ135 లీటర్ల తాగునీరు
ప్రస్తుతం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులకు 27.5 ఎంఎల్‌డీ నీటిని రెగ్యులర్‌గా అందజేస్తున్నాం. నేడు ఈ పథకానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయనుండగా నేటి నుంచి మరో 2 ఎంఎల్‌డీ అదనంగా సరఫరా చేస్తాం. ఈ నెల చివరి నాటికి 37.5 ఎంఎల్‌డీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక ప్రతి మనిషికి రెగ్యులర్‌గా 135 లీటర్ల తాగునీటి కంటే అదనంగా ఇచ్చేలా ఏర్పాటు చేశాం.
-కందుకూరి వెంకటేశ్వర్లు, ఈఈ, పబ్లిక్ హెల్త్

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...