విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం


Fri,June 14, 2019 03:44 AM

ఎంజీయూనివర్సిటీ : విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తూ నాణ్యమైన, గుణాత్మక విద్యతో విద్యా ప్రమాణాలు పెంచి వారు జీవితంలో స్థిరపడేలా చేయడమే మహాత్మగాంధీ యూనివర్సిటీ లక్ష్యమని వీసీ ప్రొ,, ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. గురువారం నల్లగొండలోని ఎంజీయూలోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ. ఎం.యాదగిరితో కలిసి మాట్లాడారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా వారి సామర్థ్యం మేరకు సీబీసీఎస్ (చాయిస్ బెస్డు క్రెడిట్ సిస్టమ్) ద్వారా సర్టిఫికెట్, డిప్లమో కోర్సులను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి ప్రత్యేక క్రెడిట్ పాయింట్లను కేటాయించడంతో పాటు సర్టిఫికెట్లను సైతం అందిస్తామన్నారు. ఇందులో భాగంగా ఎంజీయూలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పించే దిశగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల, మంత్రిత్వ శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు, జిల్లాలోని పారిశ్రామిక వేత్తల సహకారం తీసుకుంటామన్నారు. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరును విద్యావాన్ ద్వారా అమలు చేస్తు దానిని స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌కు జత చేసామని పేర్కొన్నారు. విద్యార్థులు కచ్చితంగా తరగతులకు హాజరు కావాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 5 నూతన పీజీ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2018-19 సంవత్సర వివిధ కోర్సుల పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభమైందని, జూలై 15లోగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. మూల్యాంకన విధుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో పని చేస్తున్న ర్యాటిఫైడ్, రెగ్యులర్ అధ్యాపకులను విధిగా పంపించానని ఆయా కళాశాలల యాజమాన్యాలకు, ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. ఈ నెల 17 నుంచి ఎంజీయూ పరిధిలో ఉన్న పీజీ కళాశాలల్లో తరగతులు ప్రారంభించాలని సూచించారు. ప్రతి కళాశాలలో టీచింగ్ డైరీలు, విద్యార్థుల మాన్యువల్ హాజరుపట్టికలు ఉండాలని, వాటిని యూనివర్సిటీకి పంపించాలని సూచించారు. వాటి ఆధారంగానే విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామన్నారు. ఎంజీయూలో పెండింగ్‌లో ఉన్న 34 అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల జరిగిన ఎంజీయూ పాలక మండలి సమావేశంలో యూనివర్సిటీలో లోపలివైపున ప్రహరీ వెంట రోడ్డును నిర్మించేందుకు ఆమోదం తీసుకున్నామన్నారు. వీసీ క్వార్టర్స్, పరీక్షల విభాగాల కార్యాలయాల పనులు జరుగుతున్నాయని వాటితో పాటు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కూడా ఆమోదం తీసుకున్నామన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...