ఏసీబీ వలలో గుర్రంపోడు ఎస్‌ఐ, హోంగార్డు


Thu,May 23, 2019 01:33 AM

-రైతు సమస్య పరిష్కారానికి రూ. 50 వేలు డిమాండ్
-రూ. 40 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

హాలియా, నమస్తేతెలంగాణ : ఓ రైతు భూమికి సంబంధించిన వ్యవహారంలో గుర్రంపోడు ఎస్‌ఐ డి.క్రాంతికుమార్, హోంగార్డ్ అబ్దుల్‌గఫార్ రైతు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ నల్లగొండ రేంజ్ డీఎస్పీ ఏపీ.ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం... గుర్రంపోడు మండలంలోని ఉట్లపల్లి గ్రామంలో రైతు తుమ్ములూరి వెంకట్‌రెడ్డి కొంత భూమిని కొనుగోలు చేశారు. అతడి భూమిలో బాబురావు అనే వ్యక్తి అక్రమంగా చొరబడి కడీలు(బండరాళ్లను) పాతాడు. దీంతో రైతు వెంకట్‌రెడ్డి తన భూమిలో అక్రమంగా పాతిన కడీరాళ్లను తొలగించాలని గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. రైతు వెంకట్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్రంపోడు ఎస్‌ఐ డి.క్రాంతికుమార్ భూమిలో అక్రమంగా రాళ్లను పాతిన బాబురావును పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

దీంతో బాబురావు రాళ్లను తొలగించాడు. ఆపై కొద్దిరోజుల తరువాత తిరిగి రైతు వెంకట్‌రెడ్డి భూమిలో బాబురావు అక్రమంగా రాళ్లను పాతాడు. దీంతో వెంకట్‌రెడ్డి మళ్లీ గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐకు ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించాలని రైతు పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో ఎస్‌ఐ క్రాంతి సమస్యను పరిష్కరించాలంటే తనకు రూ.50వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు తన సమస్యను పరిష్కరిస్తే రూ.40వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో రైతు వెంకట్‌రెడ్డి ఈ నెల 18న నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బుధవారం రంగంలోకి దిగిన ఏసీబీ నల్లగొండ రేంజ్ డీఎస్పీ ఏపీ.ఆనంద్, ఎస్‌ఐలు వెంకట్, లింగస్వామి గుర్రంపోడు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు.

రైతు వెంకట్‌రెడ్డి రూ.40వేల నగదును తన వెంట తీసుకోని గుర్రంపోడ్ పోలీస్‌స్టేషన్ వద్ద గల చెరుకుబండి వద్దకు చేరుకున్నాడు. బండి వద్ద ఉన్న పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు అబ్దుల్ గఫార్‌కు రైతు వెంకట్‌రెడ్డి తన వద్ద ఉన్న రూ.40వేల నగదును ఇచ్చాడు. అదే సమయంలో నిఘావేసిన ఏసీబీ అధికారులను హోంగార్డు పసిగట్టి ఆ నగదును వెంటనే చెరుకుబండి యజమానికి శ్రీచందుకు ఇచ్చాడు. అది గమనిస్తున్న ఏసీబీ అధికారులు హోంగార్డును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే అతడిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా రైతు వెంకట్‌రెడ్డి వద్ద నుంచి డబ్బు తీసుక్కోమని ఎస్‌ఐ చెప్తేనే తాను రైతు నుంచి డబ్బు తీసుకున్నానని ఏసీబీ అధికారుల ముందు ఒప్పుకున్నాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో గుర్రంపోడు ఎస్‌ఐ క్రాంతికుమార్ ఏ-1 ముద్దాయిగా, హోంగార్డు అబ్దుల్ గఫార్-ఏ2 ముద్దాయిగా, చెరుకుబండి యజమాని శ్రీచందు ఏ-3 ముద్దయిగా కేసు నమోదు చేసి ముగ్గురుని తమ అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.

ఏసీబీ దాడులతో ఉలిక్కిపడిన అవినీతి అధికారులు...
గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో రైతు నుంచి రూ.40వేల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్‌ఐ క్రాంతికుమార్, హోంగార్డు అబ్దుల్ గఫార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంఘటన విషయం ప్రచార మాధ్యమాలు, టీవీల ద్వారా తెలుసుకున్న జిల్లాలోని వివిధ శాఖల అధికారులు హడలెత్తిపోయారు. సమాజంలో ప్రజలకు రక్షకులుగా ఉండాల్సిన రక్షకభటులు లంచగొండితనానికి పాల్పడడంతో రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగి ఏసీబీ దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో జిల్లా వ్యాప్తంగా అధికారుల్లో కలకల రేకెత్తించింది. పోలీస్ యంత్రాంగంతోపాటు వివిధ శాఖల్లో లంచగొండితనం రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు అవినీతి అధికారులు తమ వక్ర బుద్ధితో లంచాలను తీసుకుంటునే ఉన్నారు. ఏసీబీ అధికారుల దాడులతో జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...