రేపే ఓట్ల లెక్కింపు


Wed,May 22, 2019 03:15 AM

-తేలనున్న నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు
-లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టిన ఇరు జిల్లాల కలెక్టర్లు
-నల్లగొండ, భువనగిరిలో ఆయా స్థానాల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు
-నల్లగొండ ఎంపీకి 27, భువనగిరి నుంచి 13మంది పోటీ
-ఈసారి ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఐదు వీవీ ప్యాట్ల లెక్కింపు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు ఉండగా.. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, దేవరకొండ, నాగార్జున సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, ఇబ్రహీంపట్నం, జనగాం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నల్లగొండ పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో దుప్పలపల్లి సమీపంలో ఉన్న గిడ్డంగుల సంస్థ గోదాముల్లో చేపట్టనున్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు పట్టణం సమీపంలోని అరోరా ఇంజినీరంగ్ కాలేజీలో చేపట్టనున్నారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మొత్తం 15,85,433 ఓటర్లు ఉండగా.. 11,75,129 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 27 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న 16,27,527 మంది ఓటర్లలో 74.39 శాతం మంది ఓటు వేశారు. ఈ స్థానం నుంచి మొత్తం 13 మంది పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే.

వీవీ ప్యాట్ల లెక్కింపుతో ఫలితం ఆలస్యం...
కౌంటింగ్ ప్రక్రియలో 1500మంది సిబ్బంది పాల్గొననున్నారు. వీరంతా ఉదయం 5.30కే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. ఏజెంట్లు, సిబ్బంది సమక్షంలో ఆరు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లు ఓపెన్ చేసి వీడియో రికార్డు చేస్తూ 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పార్లమెంట్ పరిధిలోని 7సెగ్మెంట్లలో ప్రతి సెగ్మెంట్‌కు 22నుంచి 24 రౌండ్లు ఉండనున్నాయి. ఈ రౌండ్ల వారీగా లెక్కింపు అనంతరం వెంటనే ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉండదు. ఈవీఎంలలో ఓటర్ ఓటు వేసినప్పటికి వీవీ ప్యాట్‌తో లింక్ ఉన్నందున దాన్ని ట్యాలీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నియోజక వర్గానికి సంబంధించి ఐదు వీవీ ప్యాట్లు తీసుకుని ఆయా ఈవీఎంలతో ట్యాలీ చేయడానికి లెక్కించాల్సి ఉన్నందున ఫలితం ఆలస్యం కానుంది. వీవీ ప్యాట్, ఈవీఎంలలో ఫలితాలు సమానంగా ఉంటేనే ఫలితాన్ని ప్రకటిస్తారు. లేదంటే మరోసారి ట్యాలీ చేయాల్సిన అవసరం ఉంది.

కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత...
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేస్తోంది. 500మంది పోలీస్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు గాను మూడంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. తొలి దశలో స్థానిక సివిల్ పోలీస్ రెండో దశలో రాష్ట్ర ఆర్ముడు పోలీసు, మూడో దశలో కేంద్ర పారా మిలటరీ బలగాలు ఉండనున్నాయి. ఏజెంట్లు, సిబ్బంది, జర్నలిస్టులు పాస్‌లు ఉంటేనే కౌంటింగ్ కేంద్రానికి అనుమతించనున్నారు. ఆయా కేంద్రాల సమీపంలో నాలుగు దశల్లో చెకింగ్ కార్యక్రమాన్ని చేపట్టనున్న పోలిస్ యంత్రాంగం ప్రతి కేంద్రం వద్ద మూడు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు.

సీసీ కెమెరాల పర్యవేక్షణ, వీడియో చిత్రీకరణ...
కౌంటింగ్ ప్రక్రియ చేపట్టే సమయంలో పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థ పర్యవేక్షించనుంది. వంద శాతం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరుగనుంది. ఏడు సెగ్మెంట్లకు సంబంధించిన ప్రతి హాలులోను వీడియో చిత్రీకరణ ఉంటుంది. ప్రతి హాలులో 14టేబుళ్లు ఏర్పాటు చేసినందున ఆయా టేబుళ్లను మూడో కన్నుతో పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు గాను ప్రత్యేక బృందాలను ఆయా జిల్లాల యంత్రాంగం ఏర్పాటు చేసింది.

ఫలితం తేలుస్తారిలా...
-కౌంటింగ్ కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేస్తారు.
-రిటర్నింగ్ అధికారికి అదనంగా మరో హాల్ ఉంటుంది. ఈ హాల్‌లోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కిస్తారు.
-ఉదయం 5.30 గంటలకే ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటారు.
-6గంటలకు ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను తెరుస్తారు.
-వీడియో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత నడుమ ఈవీఎంలను కౌంటింగ్ హాళ్లకు తీసుకువస్తారు.
-ఒక్కో కౌంటింగ్ హాళ్లో మొత్తం 14టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో రౌండ్‌లో 14పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
-ఒక హాల్‌లో ఒక రౌండ్ లెక్కింపు పూర్తయిన తర్వాత రిటర్నింగ్ అధికారికి పంపిస్తారు.
-ఏడు కౌంటింగ్ హాళ్ల నుంచి ఒక రౌండ్ మొత్తం వచ్చిన తర్వాత అన్నిటినీ సరిచూసిన రిటర్నింగ్ అధికారి రౌండ్ ఫలితం ప్రకటిస్తారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...