టీఆర్‌ఎస్ వైపే..


Sun,May 19, 2019 01:04 AM

-స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అధికార పార్టీ జోరు
-టీఆర్‌ఎస్ వైపు ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధుల చూపులు
-అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమనే దిశలో ఆలోచనలు
-కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నుంచి టీఆర్‌ఎస్ వైపు అడుగులు
-ఇప్పటికే స్పష్టమైన తిరుగులేని ఆధిక్యంలో తేరా చిన్నపరెడ్డి
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల్లో అంతో ఇంతో మిగిలిన ప్రజా ప్రతినిధులు సైతం పూర్తిగా ఆయా పార్టీలను ఖాళీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014లో ఉద్యమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని పార్టీల నాయకులూ క్రమంగా ఉద్యమ పార్టీ వైపు నడిచిన సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ 2015డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఎక్కువ మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు సైతం గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినా.. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ విజయభేరి మోగిస్తూ వస్తోంది. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుగులేని సత్తా చాటిన టీఆర్‌ఎస్ కేసీఆర్‌ను రెండోసారి ముఖ్యమంత్రిని చేసింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీదే హవా కొనసాగింది. ఆ తర్వాత ఇప్పటికే పోలింగ్ ముగిసిన పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే విజయం అని విశ్లేషణలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విషయంలోనూ ఆయా పార్టీల్లో అక్కడక్కడా మిగిలిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని నమ్ముతున్న పలువురు గులాబీ గూటికి చేరేందుకు ఆయా నియోజకవర్గ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్ ప్రణాళికలు...
ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లతో కలిపి 1086మంది ఓటర్లు ప్రస్తుత ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో 700మందికి పైగా కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ సహా బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీల్లో అక్కడక్కడా మిగిలిన వాళ్లు సైతం తాజా పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వరుస ప్రభంజనాలు.. ఇప్పట్లో కేసీఆర్‌కు ధీటైన నాయకత్వం ప్రతిపక్ష పార్టీల్లో ఎక్కడా కనిపించకపోవడం వంటి కారణాలు ప్రతిపక్ష నేతలను ఆలోచనల్లో పడేస్తున్నాయి. మరోవైపు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పక్షం నియోజకవర్గాల వారీగా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.

ఒక్క ఓటు కూడా మిస్సవకుండా.. ప్రతిపక్షాల్లోనూ టీఆర్‌ఎస్‌పై ఆసక్తి కలిగిన వారి ఓటర్లను రాబట్టే విధంగా ప్రణాళికతో వెళ్తోంది. ఇప్పటికే 12అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రజా ప్రతినిధులతో సమావేశాలు సైతం నిర్వహించారు. టీఆర్‌ఎస్ ఇంత చేస్తున్నా.. ఇప్పటికే ఓటమి ఆందోళనతో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్, పరిషత్ ఎన్నికల ఫలితాల్లో తమకు అనుకూల ఫలితాలు వస్తాయేమోనన్న ఆశతోనే ఎదురు చూస్తోంది.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...