పీజీలో ప్రవేశానికి కామన్ ఎంట్రెన్స్


Sat,May 18, 2019 02:03 AM

- జూన్ 14 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష
- ఉన్నత విద్యకు కేరాఫ్‌గా ఎంజీ యూనివర్సిటీ
- 13 డిపార్ట్‌మెంట్లలో 15 కోర్సుల నిర్వహణ
- ప్రతి సంవత్సరం 620 మందికి అవకాశం
- టీఎస్‌ఎంసెట్‌తో వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలు
పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గతంలో యూనివర్సిటీలు వేర్వేరుగా ఎంట్రెన్స్ టెస్ట్‌లు నిర్వహించేవి. దీని వల్ల విద్యార్థులు ఒకటికి మించి పరీక్షలు రాయాల్సి వచ్చేది. అయితే విద్యార్థుల శ్రమను తగ్గించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీలతో పాటు జేఎన్‌టీయూ-హెచ్‌లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్ సీపీజీఈటీ) పేరిట నిర్వహించే ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ముగియగా అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు గడువుంది. జూన్ 14 నుంచి 28 వరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఎంజీ యూనివర్సిటీ : ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీలతోపాటు జేఎన్‌టీయూ-హెచ్‌లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్ సీపీజీఈటీ) పేరిట నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు నల్లగొండ జిల్లాలోని ఎంజీ యూనివర్సిటీ అనేక కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే టీఎస్ సీపీజీఈటీ నిర్వహణకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. అపరాధ రుసుముతో ఈ నెల 25వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 21నుంచి 27వరకు హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి జూన్ 14నుంచి 28వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాల అనంతరం ర్యాంకుల వారీగా వెబ్ ఆప్షన్స్‌తో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వీరికోసం ఎంజీయూలో వివిధ కోర్సులు ఆహ్వానం పలుకుతుండగా.. టీఎస్ ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌లో ప్రవేశానికి అవకాశం ఉంది.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ 2007-08లో ప్రారంభమైంది. అప్పటి నుంచి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తోంది. వర్సిటీలో 13విభాగాల్లో 15 కోర్సులు నిర్వహిస్తుండగా 620మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తోంది. ఇక్కడ విద్యార్థులు యూజీసీ, ఇతర ఫెల్లోషిప్‌లకు ఎంపికవుతూ ప్రతిభ సాధిస్తుండడంతో ఎంజీయూఖ్యాతి ఎల్లలు దాటుతోంది. యూనివర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలతో ఆధునిక టెక్నాలజీతో సెంట్రల్ లైబ్రరీ, కోర్సుల అవసరమైన ల్యాబ్స్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక అంశాలపై శిక్షణ అందిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కాంపిటేటివ్ సెల్ ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
బాలబాలికలకు హాస్టల్ వసతి...
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి ఉంది. ఇందులో 480మంది బాలురకు, 320మంది బాలికలకు వసతి కల్పిస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి హాస్టళ్లకు వెళ్లేందుకు సీసీరోడ్లతోపాటు ప్రత్యేక లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.
విద్యతోపాటు సామాజిక సేవ...
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యతోపాటు విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో సేవలు అందించే విధంగా ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం)ను 2009-10 నుంచి నిర్వహిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు ప్రత్యేక శిక్షణ పొంది రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే క్యాంపులలో హాజరై ఎంజీయూతో పాటు జిల్లా ఖ్యాతిని చాటారు. వర్సిటీలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఎంబీఏ విభాగాల్లో ఆరు యూనిట్లు ఉన్నాయి. యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ అమలులో కృషి చేసినందుకు గాను గత కోఆర్డినేటర్ డా. ఆకుల రవి, గత ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ॥ యు. ఉమేష్‌కుమార్‌లు అప్పటీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జిచే అవార్డును కూడా కైవసం చేసుకున్నారు.
ఆధునిక టెక్నాలజీతో వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల
టెక్నాలజీ రంగంలో విద్యను అందించేదిశగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలను 2013-14 సంవత్సరంలో నల్లగొండ సమీపంలోని పానగల్‌లో ఏర్పాటు చేశారు. కళాశాలలో 4 బ్రాంచ్‌లలో శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉండేలా రూ.10కోట్లతో నూతన భవనం నిర్మిస్తున్నారు. ఇందులో బాలికలకు 160, బాలురకు 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) 60సీట్లు, బీటెక్ (సీఎస్‌ఈ) 60 సీట్లు, బీటెక్ (ఈసీఈ) 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే క్యాంపస్‌లో ఎంసీఏ కోర్సు కూడా నిర్వహిస్తున్నారు.
టీఎస్ సీపీజీఈటీ ద్వారా పీజీ అడ్మిషన్లు
టీఎస్ సీపీజీఈటీ పేరుతో ఆరు యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కామన్ ఆన్‌లైన్ ఎంట్రెన్స్ ద్వారా ర్యాంకులు సాధించిన వారితో ఎంజీయూలో పీజీ అడ్మిషన్లు భర్తీ అవుతాయి. ఇది విద్యార్థులకు మంచి అవకాశం. ఎంజీయూలో 15 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతులు ఉన్నాయి. విద్యార్థులు ఎంజీయూలో చేరి తమ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. పరీక్షల సెంటర్‌తోపాటు, ర్యాంకుల సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ పరిశీలనకు ఎంజీయూలో సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
- డా.రవి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, డీన్ సీడీసీ, ఎంజీయూ

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...