ఎక్కడెక్కడ? ఎవరికెన్ని?


Fri,May 17, 2019 02:33 AM

-పార్లమెంట్‌, పరిషత్‌, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కలు స్థానిక సమరం అంచనాల్లో పోటీచేసిన అభ్యర్థులు
-ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల వార్డుల వారీ విశ్లేషణ
-పార్లమెంట్‌ ఎన్నికల ఫలితంపై జనంలో అంచనాలు
-స్థానిక ఎమ్మెల్సీపై తమ ఓట్ల లెక్కలపై పార్టీల నజర్‌

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరుస ఎన్నికలతో ఓట్ల ఫీవర్‌ ఆవహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా ఇప్పుడు లెక్కల వాతావరణం అలుముకుంది. డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలు, అనంతరం జనవరిలో జరిగిన పంచాయతీ పోరు జరిగి ఫలితాలు సైతం వెలువడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏప్రిల్‌ 11న పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ముగియగా.. ఫలితాలు ఈ నెల 23న వెల్లడికానున్నాయి. మరోవైపు ఇటీవలే మూడుదశలుగా సాగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు సైతం ఈనెల 27న లెక్కింపు చేపట్టి వెల్లడించనున్నారు. దీనికితోడు ఇదే సమయంలో ఈనెల 31న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ సైతం జరగనుంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్‌ పూర్తయిన రెండు ఎన్నికల ఫలితాలతోపాటు 31న పోలింగ్‌ జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి బలమెంత అనే లెక్కలే ఇప్పుడు ఎక్కడచూసినా సామాన్యులు సైతం ఆరా తీస్తుండడం విశేషం.

అభ్యర్థుల్లో టెన్షన్‌.. సామాన్యుల్లో డిస్కషన్‌...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమకు పోలైన ఓట్లపై వార్డుల వారీగా విశ్లేషణలు చేస్తున్నారు. ఆయాప్రాంతాల్లో తమ కోసం పనిచేసిన వారితో నిత్యం వేర్వేరుగా ఆరా తీస్తున్నారు. తమకు పట్టున్న ప్రాంతాలు, సామాజికవర్గాల ఓట్ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కువ మెజారిటీ వస్తుందని తేలిన వాళ్లు.. కనీసంలో కనీసం వచ్చినా తమ విజయం ఖాయమని అంచనాలు వేస్తుండగా.. ఓటమి దిశగా లెక్కలు కనిపిస్తున్న వాళ్లు తమకు ఎక్కువ వచ్చే ప్రాంతాల్లో అధికంగా వచ్చి తామే గెలుస్తామనే ఆలోచనలు పెట్టుకున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఓట్ల విశ్లేషణ అభ్యర్థులకు టెన్షన్‌ పెంచుతుంటే.. పార్టీల పరంగా పనిచేసిన కార్యకర్తలతో పాటు సామాన్యులకు సైతం ఎక్కడలేని ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

ఇదే తరహా పరిస్థితి పార్లమెంట్‌ ఎన్నికల పరిస్థితి పైనా నెలకొంది. ముందుగా ఈనెల 23న ఆ ఫలితమే వెల్లడికానున్న నేపథ్యంలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్‌ స్థానాల్లో ఎవరు గెలుస్తారనే అంచనాలు అంతటా నెలకొన్నాయి. మరోవైపు 1086ఓట్లున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక విషయంలోనూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తోపాటు తమకు ఏమైనా ఓట్లు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయనే లెక్కలను మండలాల వారీగా అన్ని పార్టీలు వేసుకుంటున్నాయి.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...