ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం


Fri,April 19, 2019 02:36 AM

నీలగిరి : యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర అందజేస్తామని పౌర సరఫరాల శాఖకమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో ఇన్‌చార్జి జేసీ, డీఆర్వో రవీంద్రనాథ్‌తో కలిసి ధాన్యం కొనుగోలు, పలు సమస్యలపై పౌర సరఫరాలశాఖ, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధ్ది శాఖ, ఎఫ్‌సీఐ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులు మిల్లర్లకు నేరుగా పంపించి నష్టపోవద్దని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం డబ్బులను, వారి ఖాతాలోనే జమ చేయాలన్నారు. గత యాసంగిలో కంటే ఈయాసంగికి ధాన్యం ఎక్కువ రానున్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ధాన్యం రాక అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, కేంద్రాల నిర్వహకులు, సూపర్‌వైజర్లు క్షేత్ర స్థాయిలో ఉండి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా సజావుగా నిర్వహించేలా పర్యవేక్షించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎఫ్‌సీఐ గోదాముల్లో సీఎంఆర్ నిల్వకు తగిన సామర్థ్యం ఉన్న గోదాముల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో హమాలీల సమస్య లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లులకు పంపించాలన్నారు. పౌర సరఫరాల అధికారులు ట్రాక్‌షీట్స్, మిల్లర్లు జాప్యం లేకుండా అన్‌లోడ్ చేసేలా పర్యవేక్షించాలన్నారు. టార్పాలిన్లకు సరిపడా కొనుగోలు చేయాలని వర్షం పడితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మిషన్ల మరమ్మతులు ఉంటే చేసుకోవాలని సూచించారు. ఇన్‌చార్జి జేసీ, డీఆర్వో రవీంద్రనాథ్ మాట్లాడుతూ జిల్లాలో 213 కొనుగోలు కేంద్రాల ద్వారా 14,389 మంది రైతుల నుంచి రూ.189 కోట్ల 60 లక్షల విలువ కలిగిన 10.71 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు రూ.155కోట్ల బడ్జెట్ అవసరముందని తెలిపారు. దీనికి స్పందించిన ఆయన వెంటనే రెండ్రోజుల్లో విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, డీసీఓ శ్రీనివాసమూర్తి, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, డీఎస్‌డీఓ రమేష్, ఏఎస్‌డీఓ నిత్యానందం పాల్గొన్నారు.

పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం పరిశీలన...
జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద ప్రాథమిక సహకారసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ గురువారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నాణ్యత, తేమ శాతంను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి మద్దతు ధర లభిస్తుందా? అని ఆరా తీశారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులను అభినందించారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...