అకాల వర్షం..


Thu,April 18, 2019 12:47 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: అకాల వర్షం జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో రైతులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ప్రధానంగా నల్లగొండ, సాగర్, మునుగోడు, నకిరేకల్ నియోజక వర్గాల్లోని ఆయా మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వడగండ్లు సైతం పడగా కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల ఐకేపీ సెంటర్‌లో ఓ మహిళా రైతు పిడుగు పాటుతో మృతి చెందింది.

వడగండ్ల వాన...
జిల్లాలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షం ఈదురు గాలులతో ప్రారంభమై వడగండ్ల వానగా మారింది. సుమారు అరగంటకు పైగా ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కోతకు వచ్చిన వరి పైరు నేల వాలగా వడగండ్ల మూలంగా వడ్లు సైతం మట్టి పాలయ్యాయి. నేడో, రేపో పైరు పోయాల్సిన రైతులు కూడా ఈ వర్షం కారణంగా కోయలేని పరిస్థితి. వడ్లు పచ్చిగా ఉండటంతో వాటిని కోసి మార్కెట్‌కు తీసుకుపోలేని కారణంగా పైరు ఎండే వరకు వేచి ఉండాల్సిందే. ఇదిలా ఉండగా నేల వాలిన పైరు కోయడానికి అన్నదాతకు ఇబ్బందులు తప్పవు.

పలు ప్రాంతాల్లో తడిసిన ధాన్యం...
జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఆయా ప్రాంతాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేస్తుండగా ఆయా కేంద్రాలకు ఈ ధాన్యాన్ని తరలించగా వర్షం కారణంగా పాక్షికంగా తడిచింది. కొన్ని ప్రాంతాలలో మార్కెట్లలో ధాన్యం పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నందున ఆయా కేంద్రాలు మార్కెట్ పరిధిలో ఉన్నందున వాటికి పెద్దగా ఇబ్బంది లేదు. అయితే ఐకేపీ కేంద్రాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం వల్ల అవి పాక్షికంగా తడిచాయి. నల్లగొండ, తిప్పర్తి, కనగల్, చండూరు, నిడమనూరు, చిట్యాల ప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొంత మేరకు తడిచింది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా కట్టంగూర్ మండలం సత్యనారాయణపురం గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో పిడుగు పడటంతో రాణి(32) అనే మహిళ మృతి చెందింది.

చండూరులో వడగండ్లు
చండూరు,నమస్తేతెలంగాణ: మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం ఈదురుగాలులలతో వర్షం కురిసింది. దీంతో రైతులకు అపార నష్టం కలిగింది. కస్తాల గ్రామ పరిధిలో వడగండ్ల వర్షం కురిసింది. వరిచేళ్లు కొత దశలో ఉండటంతో ఈ వర్షం దాటికి నేలకొరిగాయి. మండల వ్యాప్తంగా వరిచేలు 90శాతానికిపైగా వరిచేను కొతకు రావడంతో ఈ వర్షం రైతులకు నష్టం జరిగింది. దీనికితోడు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసింది.

పిడుగుపాటుకు మహిళా రైతు మృతి
కట్టంగూర్ : పిడుగుపాటుకు మహిళా రైతు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని మునుకుంట్ల గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కురుమర్తి గ్రామానికి చెందిన చెన్నబోయిన రాణి (32) మూడ్రోజుల క్రితం ధాన్యాన్ని విక్రయించేందుకు సత్యనారాయణపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన మునుకుంట్ల గ్రామ ఐకేపీ కేంద్రానికి తీసుకువచ్చింది. కాగా, రాణి తన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో ఆరబెడుతోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో ధాన్యాన్ని కుప్ప పోసేందుకు రాణి ఐకేపీ కేంద్రానికి వచ్చింది. ధాన్యాన్ని కుప్పపోస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడి మంటలు లేవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం రాణి మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వదవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎంపీపీ కొండా లింగస్వామి, జడ్పీటీసీ మాద యాదగిరి సందర్శించి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అపార నష్టం
కనగల్ : మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం ఆకాల వర్షం కురవడంతో రైతులకు అపారనష్టం జరిగింది. మండల వ్యా ప్తంగా ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీనికితోడు 90 శాతం వరిచేను కోత దశలో ఉండటంతో ఈ వర్షంతో నేలకొరిగింది.

మునుగోడులో భారీ వర్షం
మునుగోడు : మునుగోడు మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు ఇప్పర్తి, కిష్టాపురం, కోతులారం, సింగారం, వెల్మకన్నెల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో జనజీవం స్తంభించింది. ఇప్పర్తిలో ఈదురుగాలుల వర్షంతో ఇండ్ల పైకప్పులు లేచికిందపడ్డాయి. అంతే కాకుండా వాహనాలపై చెట్లు కూలడంతో ధ్వంసమయ్యాయి.

తడిసిన ధాన్యం..
చిట్యాల :మండలంలో బుధవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో మండలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం వర్షం తడిసింది. పలు గ్రామాలలో వరిచేను నేలకొరిగింది. మామిడి, నిమ్మకాయలు నేలరాలాయి. చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడువడంతో రైతులునీటిని ఎత్తి కుప్ప పోశారు. ధాన్యాన్ని చూసి రైతులు కంటతడిపెట్టారు.

ఈదురు గాలులతో ...
కేతేపల్లి : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండతో ఇబ్బందులు పడ్డ ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఈదురు గాలులతో కోతకు వచ్చిన వరిపొలం, ఐకేపీ కేంద్రాల్లో పోసిన ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. చీకటిగూడెం, కేతేపల్లి, కొర్లపహాడ్, ఉప్పలపహాడ్‌లో సర్వీసు రోడ్డు వెంబడి పోసిన ధాన్యం వర్షానికి తడిసింది.

207
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...