కొనసాగుతున్న సాగు సర్వే


Thu,April 18, 2019 12:46 AM

నల్లగొండ, నమస్తేతెలంగాణ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే అనేక సంస్కరణలు, పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. మార్కెట్‌లో అవసరాలు, డిమాండ్‌ను బట్టి పంట ఉత్పత్తి చేస్తే రైతుకు మేలు జరుగుతుందని భావించిన ప్రభుత్వం పంట కాలనీల వైపు దృష్టి సారించింది. వాతావరణ పరిస్థితులు, భూముల్లోని సారాన్ని బట్టి పంటలు సాగు చేస్తే మంచి దిగుబడి రావడంతోపాటు రైతుకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి వ్యవసాయ యంత్రాంగం సాగు సర్వేను చేపట్టింది. ఆధార్ సమాచార వినియోగానికి అంగీకార పత్రం పేరుతో 39 అంశాలను రైతుల వద్ద నుంచి సేకరిస్తున్నారు.

రైతుల వారీగా సాగు సర్వే...
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన సాగుసర్వే రైతు వారీగా కొనసాగుతోంది. వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ సిబ్బందితో పాటు ఐకేపీ సహకారంతో అన్ని గ్రామాల్లోనూ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 142 వ్యవసాయ క్లస్టర్లుండగా ఏఈఓలు బాధ్యత వహించి ఈ సర్వే చేపడుతున్నారు. రైతు ప్రస్తుతం ఏ పంట వేశాడు, దాని విస్తీర్ణం, పెట్టుబడి, దిగుబడి, మార్కెటింగ్, మిగులుబడి కోణంలో వివరాలు సేకరిస్తూ సర్వే చేపడుతున్నారు. రైతు వారీగా చేపట్టే ఈ సర్వేలో రైతు సాగు చేసిన పంట భూమి వివరాలు, వాటిని మార్కెటింగ్ చేయడంపై ప్రధాన దృష్టి సారించారు. మే 15 వరకు సర్వే నిర్వహించి రైతు వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.

పంట కాలనీల ఏర్పాటే లక్ష్యంగా...
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంట కాలనీల వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం జిల్లాలో వాణిజ్య పంట అయిన పత్తి అధికంగా సాగవుతుండగా ఆ తర్వాత వరిసాగు చేపడుతున్నారు. ఒకప్పుడు బత్తాయి సాగులో ఉమ్మడి రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉండగా క్రమంగా వెనుకబడింది. ఇటీవల కూరగాయల సాగు పెరుగుతున్నప్పటికీ మార్కెటింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక పప్పు దినుసులవైపు రైతాంగం ఆలోచనే చేయడం లేదు. ఈ కోణంలో వివరాలు సేకరిస్తున్న అధికార యంత్రాంగం జిల్లాలో ఏ మేరకు అవసరాలుంటాయి. ఇక్కడ నేలల పరిస్థితి ఏమిటి... ఏ పంట బాగా దిగుబడి వస్తుంది.. అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే అనంతరం సర్కార్ సూచన మేరకు మండలాల, లేదా క్లస్టర్ల వారీగా పంట కాలనీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో అధికారులున్నారు.

జిల్లాలో ప్రాసెసింగ్ యూనిట్లు
పంట కాలనీలను ఏర్పాటు చేస్తూ ఆయా పంటలను రైతులతో సాగు చేయించడంతోపాటు ఆయా పంటలకు తగిన గిట్టుబాటు ధర రావాలంటే ప్రాసెసింగ్ యూనిట్లే మేలని ప్రభుత్వం భావిస్తోంది. పత్తి పండిస్తే జిన్నింగ్ మిల్లులు, వరి పండిస్తే రైస్ మిల్లులు అవసరం. ఇక బత్తాయి నిమ్మతోపాటు పప్పు దినుసులకు ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్లు, పండ్లు, మిర్చికి కోల్డ్ స్టోరేజీలు అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగానే ఆలోచన చేసి వ్యవసాయ, ఉద్యాన, ఐకేపీ, పరిశ్రమలు, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో ఈ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం వ్యవసాయ, ఉద్యాన, ఐకేపీ శాఖలు సాగు సర్వే చేపట్టి పంటల మార్పిడి చేస్తూ కాలనీలు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోనుండగా తర్వాత పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రాసెస్ అయిన ఉత్పత్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకోనుంది.

మే 15వరకు సాగు సర్వే
జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి వ్యవసాయ, ఉద్యాన, ఐకేపీ సిబ్బంది సహకారంతో సాగు సర్వే ప్రారంభించాం. అన్ని గ్రామాల్లో రైతు వారీగా చేపట్టిన సర్వేలో 39 అంశాలను సేకరిస్తున్నాం. మే 15 వరకు సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రధానంగా పంట కాలనీల ఏర్పాటే లక్ష్యంగా ఈ సర్వే కొనసాగుతుంది.
-శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...