పోలీస్ ఈవెంట్స్‌లో పైలటింగ్


Sun,April 14, 2019 02:05 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్, నియమకాల విషయంలో కొందరు అభ్యర్థులు కింది స్థాయి సిబ్బందితో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిన ఈ నియామకాల్లో జరిగిన ఆక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఒకరికి బదులు మరొకరు ఈవెంట్స్‌కు హాజరై ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించగా కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి సర్కార్ ఆశయాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు గుర్తించిన పోలీస్ యంత్రాంగం నలుగురిని కోర్టుకు రిమాండ్ చేసినప్పటికీ ఒక్కరు కాదు, ఇంకా అక్రమాలకు పాల్పడిన వారు చాలా మంది ఉన్నారని శనివారం ఎస్పీ కార్యాలయం ఎదుట అభ్యర్థులు ధర్నా చేయడంతో విషయం సంచలనమైంది. ఈ విషయంలో ఇప్పటికే నలుగురిని రిమాండ్ చేసిన పోలీస్ యంత్రాంగం మరెవరైన ఇలాంటి తరహాలోనే అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఉద్యోగమే ధ్యేయంగా ....
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సోదరుడికి ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న ఇద్దరు అభ్యర్థుల సహకారం తీసుకొని అవకతవకలకు పాల్పడినారు. అధికారుల కన్నుగప్పి కిందిస్థాయి సిబ్బందితో చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఈవెంట్స్‌లో పాల్గొన్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం కొర్వేనిగూడేనికి చెందిన మహేష్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లా దత్తుపల్లి మండలం నిధానంపల్లికి చెందిన కాగు సతీష్ కొంత కాలంగా పోలీస్ ఉద్యోగాల కోసం జిల్లా కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. వీరి ద్వారా ఎలాగైన ఎస్‌ఐ ఉద్యోగం పొందాలని నిర్ణయించుకున్న సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన పెండెం సతీష్ అవకతవకలకు పాల్పడ్డాడు. దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు పోలీసులు ముందుగా నెంబర్‌ప్లేట్ ఇస్తారు. దానిని తీసుకున్న సతీష్ నెంబర్‌ప్లేట్‌తో మైదానం నుంచి బయటికి వచ్చి అప్పటికే బయట ఉన్న కాగు సతీష్‌కు నెంబర్ ప్లేట్ ఇచ్చాడు. ఆ నెంబర్ ప్లేట్‌తో 100, 800మీటర్ల పరగుపందెంతో అర్హత సాధించాడు. అదేవిధంగా లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్‌కు మరోవ్యక్తి మహేష్‌తో చేయించాడు, దీనికంతటికీ సతీష్ సోదరుడు ఏఆర్ కానిస్టేబుల్ ఉపేందర్ సహకారం అందించినట్లు పోలీసులు గుర్తించారు.

బయటికి పొక్కిందిలా...
అవకతవకలకు పాల్పడిన సతీష్ తన సొంత గ్రామం లో తనకు పక్కాగా ఉద్యోగం వస్తుందని ప్రచారం నిర్వహించుకుంటున్నాడు. దీంతో కొంతమంది వ్యక్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కోసం కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పాయింట్లు కావాలనే ఉద్దేశ్యంతో కిందిస్థాయి ఉద్యోగులతో కుమ్మక్కై కంప్యూటర్‌లో తప్పుడు పాయింట్లు వేయించుకున్నట్లు బాధిత అభ్యర్థులు ఆరోపించారు. వాస్తవంగా పోలీసులు ఇచ్చిన నెంబర్‌ను కాకుండా 5.3మీటర్లు దూకిన వారికి 5.6, 5.8 చొప్పున కంప్యూటర్‌లో పొందుపరిచనట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే శనివారం ఈ విషయం బయట పడి ఆందోళన చేయడంతో ఆపరేటర్ పరారీలో ఉన్నాడు. ఆపరేటర్ దొరికితే గానీ అవకతవకల డొంక కదిలే అవకాశం ఉంది. అయితే ఈ అవకతవకలు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ పెండెం ఉపేందర్, అతడి సోదరుడు సతీష్‌తో పాటు ఎడ్ల మహేష్, కాగు సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు.

అభ్యర్థుల ఆందోళన
నల్లగొండ క్రైం : పోలీసు ఈవెంట్స్‌లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని శనివారం కొంతమంది అభ్యర్థులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాంగ్‌జంప్, హైజంప్, ఎత్తుకొలతల్లో డబ్బులు తీసుకొని మార్కులు వేశారంటూ ఆరోపించారు. ఇలా చేయడం వల్ల టాలెంట్ ఉన్న అభ్యర్థులు నష్టపోతున్నరాని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారిని టూటౌన్ పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...