అంగన్‌వాడీలు ఒంటి పూటనే..


Sun,April 14, 2019 02:03 AM

నీలగిరి: అంగన్‌వాడీ పాఠశాలలు ఏప్రిల్ 8 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగినందున అంగన్‌వాడీ పాఠశాలల పని వేళలు ఒక పూటకు పరిమితం చేయాలని సంఘం నాయకుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 10వరకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ ఒంటిపూటనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో, రేకుల గదుల్లో నిర్వహిస్తుండడంతో చిన్నారులు వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రభుత్వం ముందుగా ఒంటిపూట బడులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎండ తీవ్రత కారణంగా ఎన్నికల కోడ్ ఉండడంతో రాష్ట్రంలో మౌఖిక ఆదేశాలు జారీ చేసి ఏప్రిల్ 8న జీఓ 847ను విడుదల చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం యథావిధిగా అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. దీంతో అంగన్‌వాడీ సంఘాల నాయకులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని అంగన్‌వాడీలు 2093
జిల్లాలో 9 ప్రాజెక్టుల పరిధిలో 1831 అంగన్‌వాడీ కేంద్రాలు, 262 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు మొత్తం 2093 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా గర్భిణులకు, బాలింతలకు, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ప్రతి నెలా ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా8466 మంది గర్భిణులకు, 7966 బాలింతలకు, 58531మంది 3 ఏళ్లలోపు పిల్లలకు ఒక పూట సంపూర్ణ ఆహారాన్ని అందిస్తోంది. వీరుగాకుండా 21594 మంది 3నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తుంది. వీరికి అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆయాలు వంట చేసి పెడుతున్నారు. వేసవిలో ఎండ తీవ్రత 40డిగ్రీలకు పైగా దాటుతుండటంతో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులు వేడికి తట్టుకోలేక పోతున్నారు. జిల్లాలో అత్యధికంగా అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో తాగునీరు, కరెంట్ వసతి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్చిలోనే 40 డిగ్రీల ఎండ తీవ్రత ఉంటే వచ్చే 2 నెలల్లో ఎండ తీవ్రత ప్రమాద స్థాయికి వచ్చే అవకాశం ఉందని, ఎండలు తీవ్రతరమై మధ్యాహ్నం 11 గంటలకే వడగాల్పులు వీస్తుండటంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఎండ తాకిడిని తట్టుకోలేక ఇంట్లో నుంచి కేంద్రాలకు రావడం లేదని అంగన్‌వాడీలు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చారు. అంతేగాకుండా జిల్లాలో చాలా అంగన్‌వాడీకేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటంతో మౌలిక వసతులు లేకపోవడంతో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలు వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని అంగన్‌వాడీ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో వాటిని సవరిస్తూ ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్‌వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జూన్ 10 వరకు ఒంటిపూటే నిర్వహణ
జిల్లాలో వేసవి ఉష్ణోగ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలను ఏప్రిల్ 8 నుంచి జూన్ 10వరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఎండ తీవ్రత కాకముందే బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి. అంగన్‌వాడీ కేంద్రాలు ఒంటిపూట నిర్వహిస్తున్నాం. కానీ చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందించే పౌష్టికాహార విషయంలో ఎలాంటి మార్పులు లేవు.
- తూముల నిర్మల, సీడీపీఓ, నల్లగొండ ప్రాజెక్టు ఐసీడీఎస్

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...