పరిషత్ పోరుకు రంగం సిద్ధం


Sun,April 14, 2019 02:02 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లాలో శాసనసభ, సర్పంచ్, ఎమ్మెల్సీ, ఎంపీల ఎన్నికల వేడి తగ్గకముందే మండల ప్రాదేశిక నియోజక వర్గాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రెవెన్యూ గ్రామాల వారీగా 3 నుంచి 5 వేల జనాభాను పరిగణలోకి తీసుకుని ప్రాదేశిక నియోజక వర్గాలను గుర్తించి పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేయగా ఈ నెల 18న కలెక్టర్ల సమావేశం తర్వాత షెడ్యూల్ విడుదల కానుంది. జిల్లాలో 349 మండల ప్రాదేశిక స్థానాలుండగా 31 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో 1927 పోలింగ్ కేంద్రాలున్నాయి.

20 తర్వాత షెడ్యుల్ విడుదల..
జిల్లా వ్యాప్తంగా 349 ఎంపీటీసీ స్థానాలతో పాటు 31 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందకు ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేయనుంది. శనివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ నెల 18న కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగనుండగా ఆ తర్వాత షెడ్యూల్‌కు సంబంధించి తుది రూపు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 22న తొలి నోటిఫికేషన్ జారీ కానుండగా 6వ తేదీన నల్లగొండ రెవిన్యూ డివిజన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 26న రెండో నోటిఫికేషన్ బట్టి 10 తేదీన దేవరకొండ డివిజన్ 30న తుదినోటిఫికేషన్ బట్టి 14వ తేదీన మిర్యాలగూడ డివిజన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

మూడు విడుతలుగా ఎన్నికలు
జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మూడు విడుతలుగా జరుగనున్నాయి. తొలి విడుతలో వచ్చే నెల 6వ తేదీన నల్లగొండ రెవిన్యూ డివిజన్‌లోని నల్లగొండ, తిప్పర్తి, కనగల్, చండూరు, మునుగోడు, చిట్యాల, కట్టంగూర్, కేతేపల్లి, నకిరేకల్, శాలీగౌరారం, మండలాల్లో ఎన్నికలు జరుగనుండగా.. 10వ తేదీన చందపల్లి, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పీఏపల్లి, నేరడుగొమ్ము మండలాల్లో మూడో విడుతలో అడవిదేవుల పల్లి, అనుముల, దామరచర్ల, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

పూర్తయిన రిజర్వేషన్లు
2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటికే జిల్లాపరిషత్ పీఠంతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీల రిజర్వేషన్లు సైతం ప్రకటించారు. జిల్లాలో 31 జడ్పీటీసీ, ఎంపీపీలు ఉండగా 349 మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో 600 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేశారు. గరిష్టంగా 650 ఓటర్ల వరకు ఒక పోలింగ్ స్టేషన్‌లో ఉంచినప్పటికీ అంతకు మించితే రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ లెక్కన జిల్లాలో 1927 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు, పరిష్కారాల అనంతరం ఈ నెల 20 తుది జాబితా విడుదల చేయనున్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...