ఒక్కో సీటుకు ఆరుగురు


Sat,April 13, 2019 06:09 AM

చివ్వెంల : గురుకులాలు పేద, మధ్య తరగతి వర్గాలకు వరంగా మారాయి. అత్యుత్తమ స్థాయిలో వసతులు, నాణ్యమైన విద్యను అందించడంలో పోటీ పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు పోటీ పెరుగుతోంది. సకల వసతులు, ఆధునిక సౌకర్యాలు, సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గురుకులాల్లో చేరాలనుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. గత ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలను కనీసం పట్టించుకోకపోగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేశాయి. తరగతి, నివాసగదులు అధ్వానంగా, శిథిలావస్థలో ఉండేవి. దీంతో ఆ గదుల్లో ఉండి చదువుకునేందుకు విద్యార్థులు నానా తిప్పలు పడేవారు. వర్షాకాలంలో అయితే విద్యార్థుల ఇబ్బందులు వర్ణణాతీతం. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ విద్యను పటిష్టం చేస్తూనే మరోపక్క అన్ని వర్గాల వారి కోసం గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారు. హాస్టల్ మెనూను సైతం మార్చారు. వారానికి నాలుగు సార్లు చికెన్, రెండుసార్లు మటన్, ప్రతిరోజు గుడ్డూ అల్పాహారంతో పూరి, ఇడ్లి, టమాటా రైస్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం పాలు, కాఫీ, సాయంకాలం పకోడి, ఉడకపెట్టిన శనగలు తదితర పూర్తి స్థాయిలో పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. దీంతో ప్రతియేటా 5వ తరగతిలో విద్యార్థులు ప్రవేశానికి వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ప్రాధాన్యతనిస్తున్నట్లు బోధన సిబ్బంది చెప్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు సూర్యాపేట జిల్లా పరిధిలో కేవలం 4గురుకులాలు ఉండగా ఐదేళ్లలో 14 గురుకులాలకు పెరిగాయి.

తరగతికి 80మంది..
జిల్లాలో మొత్తం 18 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కో పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి ఒక్కోసెక్షన్‌కు 40మంది చొప్పున మొత్తం 80మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. మార్చి 15వరకు అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తికాగా.. జిల్లాలో 1440సీట్లకుగాను మొత్తం 8,623 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఒక్కో సీటుకు ఆరుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో ఎస్సీ సంక్షేమ గురుకులాలు చివ్వెంల బాలురు, ఇమాంపేట బాలికలు, మఠంపల్లి బాలికలు, జాజిరెడ్డిగూడెం బాలికలు, మునగాల బాలురు, హుజూర్‌నగర్ బాలురు, తుంగతుర్తి బాలికలు, నడిగూడెం బాలికలు ఉన్నాయి. గిరిజన కులాల సంక్షేమ గురుకులాలు తుంగతుర్తి బాలికలు, చివ్వెంల బాలికలు రెండు పాఠశాలలు ఉన్నాయి. అలాగే బీసీ సంక్షేమ గురుకులాలు నాగారంలో బాలురు, నేరేడుచర్ల బాలురు, సింగారెడ్డిపాలెం బాలికలు, కోదాడ బాలికలు ఉండగా మైనారిటీలకు సూర్యాపేట, తుంగతుర్తిలలో బాలురు, కోదాడ, హుజూర్‌నగర్‌లలో పాఠశాలలు ఉన్నాయి.

ఇక్కడకు వచ్చిన వారు అదృష్టవంతులు
గురుకులాల్లో సీటు వచ్చిన వారు ఎంతో అదృష్టవంతులు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. భోజనం బాగుంది. చదువు చాలా మంచిగా చెప్తున్నారు. మంచి క్రమశిక్షణ, పట్టుదలతో చదివి బోధించిన గురువులకు, విద్యాలయానికే కాదు సకల సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొస్తాం.
-కె.సాక్షిత, 9వ తరగతి, గురుకుల పాఠశాల, ఇమాంపేట

ఆహ్లాదకరమైన వాతావరణం
మా గురుకుల పాఠశాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. విద్యాలయం ఇంటిని మరిపిస్తుంది. సెలవుల్లో కూడా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ పాఠాలు చాలా బాగా చెబుతున్నారు. మాకు మంచి భోజనం, మంచి వసతి కల్పించారు. తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకొస్తాను.
- ఎం.బిందు 5వ తరగతి, గురుకుల పాఠశాల, ఇమాంపేట

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...