పోలింగ్ సాఫీగా...


Fri,April 12, 2019 01:25 AM

- ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
- అక్కడక్కడా మొరాయించిన ఈవీఎంలు.. కొంత ఆలస్యం
- పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయా పార్టీల అభ్యర్థులు
- పావురాలగట్టులో రెండు గంటలు ఆలస్యంగా ఓట్లేసిన జనం
- కొండమల్లేపల్లిలో గుండెపోటుతో కాంగ్రెస్ ఏజెంట్ మృతి
- శాలిగౌరారం ఎస్‌ఐ మహిళలపై దాడి చేశారంటూ ధర్నా

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ ప్రశాంతంగా సాగింది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపులు.. ఒకటీ రెండు చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ఉమ్మడి జిల్లా వాసులు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలోని సెయింట్ ఆన్స్ పాఠశాల పోలింగ్ బూత్‌తోపాటు, ఆత్మకూర్(ఎస్) మండలం ముక్కుడు దేవులపల్లి, చిట్యాల మండలం బోయగుబ్బ, పీఏపల్లి మండల కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. నేరేడుచర్లలోని 31వ పోలింగ్ బూత్‌లో వీవీ ప్యాట్ కనెక్షన్ ఎర్రర్ రావడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. తమ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ పీఏ పల్లి మండలం పావురాలగట్టు వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. జడ్పీటీసీ తేరా గోవర్ధన్‌రెడ్డి గ్రామస్తులకు నచ్చజెప్పి ఎమ్మెల్యే రవీందర్ కుమార్‌తో మాట్లాడించిన అనంతరం పోలింగ్‌లో పాల్గొన్నారు.

స్వల్ప ఘర్షణలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు...
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా అంతటా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం లింగోటంలో టీఆర్‌ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం మొరసకుంట తండాలో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో టీఆర్‌ఎస్ కార్యకర్త రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. శాలిగౌరారం మండలం కొత్తపల్లి గ్రామంలో స్వల్ప ఘర్షణ నెలకొనగా.. ఆ గొడవ సద్దుమణిచే సమయంలో స్థానిక ఎస్‌ఐ గోపాల్‌రావ్ మహిళలపై చేయి చేసుకున్నాడని గ్రామస్తులు ఆందోళన చేశారు. ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లెపల్లిలో కాంగ్రెస్ ఏజెంట్ నాయిని జైపాల్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.

ఓట్లేసిన ప్రముఖులు.. పోలింగ్ పరిశీలించిన అభ్యర్థులు...
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలువురు జిల్లా ప్రముఖులు తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, తన సతీమణి సునీతతో కలిసి సూర్యాపేటలో ఓటు వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్‌లో.. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటు వేసిన అనంతరం పోలింగ్ సరళిని పరిశీలించారు. ఆత్మకూర్(ఎస్), చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్, మద్దిరాల, తుంగతుర్తిలో మంత్రి జగదీష్‌రెడ్డి పోలింగ్ సరళి స్వయం గా పరిశీలించారు. భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నకిరేకల్ పట్టణం, మనుగోడు మండల కేంద్రం, మర్రిగూడెం మండలంలోని శివన్నగూడెం సహా పలు పోలింగ్ కేం ద్రాల్లో పర్యటించారు. నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి హైదరాబాద్‌లో ఓటు వేసిన అనంతరం సూర్యాపేట, కోదాడ, మునగాల, త్రిపురారం మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలతో కలిసి పోలింగ్ సరళి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. హుజూర్‌నగర్ మండ లం మాధవరాయినిగూడెంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...