మే 23న లెక్కింపు


Fri,April 12, 2019 01:24 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. అయి తే, ఫలితం తెలుసుకోవడానికి.. 42రోజుల పాటు వేచి చూడాల్సిందే. దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రి య ముగిసిన తర్వాత మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులతోపాటు రాజకీయులు, జిల్లా ప్రజల్లోనూ ఎంపీ ఎన్నికల ఫలితాలపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తం కాగా.. జననాడిని అంచనా వేసేందుకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే పలువురు ఆరా తీయడం కనిపించింది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లతోపాటు బీజేపీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ తమ లెక్కల్లో మునిగి తేలుతున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ, భువనగిరి స్థానాల ఎంపీ అభ్యర్థుల భవితవ్యం వచ్చే నెల 23న తేలనుంది. మన దగ్గర తొలిదశలోనే ఎన్నికలు జరగ్గా.. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఫలితం వెల్లడి కావడానికి 42 రోజుల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే అందరు అభ్యర్థులు, జిల్లా వాసుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మండలాలు, పోలింగ్ బూత్‌ల వారీగా ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది? ప్రస్తుతం ఆయా బూత్‌ల పరిధిలో ప్రభావం చూపగల నాయకులు ఏయే పార్టీల వైపు ఉన్నారు? తమకు ఆయా బూత్‌ల వారీగా ఎన్నెన్ని ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయనే లెక్కలను ప్రధాన పార్టీల అభ్యర్థులు వేస్తున్నారు. మరోవైపు గురువారం పోలింగ్ జరుగుతుండగానే.. పలువురు మీడియా సిబ్బంది, సర్వే సంస్థల సిబ్బంది ఎగ్జిట్ పోల్స్ కోసం ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నాలు సైతం తీవ్రంగానే చేయడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన తమదే ఈసారి ఘన విజయమని టీఆర్‌ఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు ఉండగా.. కాంగ్రెస్ సైతం తమ గెలుపుపై ధీమా ప్రదర్శిస్తోంది.

విజయంపై ఎవరి ధీమా వారిదే...
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12అసెంబ్లీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 3 స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఒక్క హుజూర్‌నగర్ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా.. అన్ని స్థానాల్లో కలిపి టీఆర్‌ఎస్‌కు మొత్తం 1,01,938 ఓట్లు ఆధిక్యత వచ్చింది. ఇక భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడింట మునుగోడు, నకిరేకల్ స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే నకిరేకల్‌లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు. అయినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసుకున్నా.. కాంగ్రెస్ కంటే టీఆర్‌ఎస్‌కు భువనగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం 1,30,514 ఓట్ల మెజారిటీ వచ్చింది. అసెంబ్లీ ఫలితాలను బట్టి చూస్తే టీఆర్‌ఎస్ విజయం పార్లమెంట్ ఎన్నికల్లోనూ సునాయాసమే అన్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ విజయంతో పాటు భారీ మెజారిటీల పైనా ధీమా ప్రదర్శిస్తుంటే కాంగ్రెస్ సైతం ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ, వామపక్ష పార్టీల అభ్యర్థులు సైతం తమకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఓట్ల లెక్కింపుకు సుదీర్ఘ సమయం ఉన్న నేపథ్యంలో వేసవి మొత్తం జిల్లా వాసులకు ఎవరు గెలవనున్నారనే చర్చతోనే సాగే అవకాశం ఉంది.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...