ఓటమిని అంగీకరించి పారిపోయిన ఉత్తమ్


Tue,March 26, 2019 01:23 AM

నీలగిరి : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికలకు ముందే సవాల్‌ను స్వీకరించలేక ఓటమిని అంగీకరించి పారిపోయాడని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకముంటే ముందు ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరితే, దానికి స్పందించకుండా పారిపోయి ముందే ఓటమిని అంగీకరించాడన్నారు. పైగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంపై ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదన్నారు. జిల్లాలో ప్లోరైడ్ పాపానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని, నాలుగున్నర సంవత్సరాల కాలంలో దీని పరిష్కారానికి కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని తెలిపారు. రూ.30వేల కోట్లతో 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఇండస్ట్రియల్ పార్కు, యాదాద్రి టెంపుల్ లాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

అసెంబ్లీ ఫలితాలు పునరావృతమవుతాయి..
గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తిరిగి పునరావృతమవుతాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని జిల్లా నుంచి పారదోలి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా గులాబీ కోట అని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో రుజువు చేశారని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ఉత్సాహంతో ఉమ్మడి జిల్లాలోని 2స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్..
అబద్ధాలకు, అవినీతికి, కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి వారు అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. గతంలో టీఆర్‌ఎస్ ఒక్క అసెంబ్లీ సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తానన్న రాజగోపాల్‌రెడ్డి ఎందుకు స్వీకరించలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల మెజార్టీ రాకపోతే పదవిలో ఉండనన్న ఉత్తమ్ ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు తెలంగాణ ప్రజల పట్ల విర్రవీగి మాట్లాడితే నేడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు తాళాలు పడ్డాయని, త్వరలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీభవన్‌కు కూడా తాళాలు పడనున్నాయని పేర్కొన్నారు.

నా గెలుపు నల్లేరుపై నడకే : వేమిరెడ్డి
టీఆర్‌ఎస్ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తన గెలుపు నల్లేరు మీద నడకేనని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని తెలిపారు. సేవాగుణంతో రాజకీయాలకు వచ్చానని, నిజాయితీగా వ్యాపారం చేసే నాకు సీఎం కేసీఆర్ ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించారన్నారు. నల్లగొండ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్‌లో జిల్లా సమస్యలు ప్రస్తావించి పరిష్కారం చూపుతానని తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, నోముల నర్సింహయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, నల్లమోతు భాస్కర్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శానంపుడి సైదిరెడ్డి , ఐసీడీఎస్ రీజనల్ ఆర్గనైజర్ మాలె శరణ్యారెడ్డి, బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు చకిలం అనిల్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...