జిల్లాకు పట్టిన కాంగ్రెస్ శని పోవాలె


Mon,March 25, 2019 01:51 AM

- తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయ్యింది
- ఉద్యమంలో కేసీఆర్ చెప్పిన మాటే నిజమైంది
- ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అడ్రస్ సైతం ఉండదు
- సేవాగుణం ఉన్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
- దేవరకొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

దేవరకొండ, నమస్తేతెలంగాణ : మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని తిరస్కరించారు. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఉత్తమ్ ఒక్కడే ఎలాగోల బయట పడ్డాడు. ఇప్పుడు అతడికి కూడా బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో జిల్లాకు పట్టిన కాంగ్రెస్ శనిని పోగొట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్‌హాల్లో జరిగిన దేవరకొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోటలు మంచుకొండల్లా కరిగిపోతున్నాయని, నల్లగొండలో ఉత్తమ్, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఒక్కసారైన దేవరకొండ నియోజకవర్గానికి వచ్చింది లేదని, ఆయన మంత్రిగా పనిచేశారన్న విషయం కూడా ఇక్కడి ప్రజలకు తెలియదని పేర్కొన్నారు. సాగర్ ఎడమ కాల్వ కింద ఏండ్ల తరబడిగా కరువు పరిస్థితులకు కాంగ్రెస్ నాయకులే కారణమని, ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు నీరందించిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.

నల్లగొండ జిల్లా నైసర్గిక స్వరూపమే తెలియని ఉత్తమ్‌కు ఈ ప్రాంత ప్రజలు ఎలా ఓటేస్తారని పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నుంచి తిరస్కరణకు గురైన నాయకులు లోక్‌సభకు ఎలా పనికి వస్తారని, ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డే కాదు ఆపార్టీ నుంచి పోటీచేస్తున్న ప్రతి నాయకుడు చెల్లని రూపాయే అని ఘాటుగా విమర్శించారు. నల్లగొండలో ఓడిన కోమటిరెడ్డిని భువనగిరిలో, కొడంగల్‌లో ఓటమిపాలైన రేవంత్‌ను మల్కాజ్‌గిరిలో, వికారాబాద్‌లో ఓడిన చంద్రశేఖర్‌ను పెద్దపల్లిలో, ఖానాపూర్‌లో ఓడిన రమేష్ రాథోడ్‌ను అదిలాబాద్‌లో నిలబెట్టిన ఆ పార్టీ నేతలు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినట్లుగా లోక్‌సభ ఎన్నికల నాటికే తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయ్యిందని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా భూస్థాపితం కానున్నదని మంత్రి పేర్కొన్నారు. యావత్ భారతదేశం సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటోందన్నారు.

16 ఎంపీ స్థానాలను గెలిపించి కేసీఆర్‌ను జాతీయ స్థాయికి పంపేందుకు ప్రజానీకం సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి నర్సింహారెడ్డిని నల్లగొండ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో దేవరకొండ జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్, వైస్ చైర్మన్ నల్లగాస్ జాన్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు బాలనర్సింహ, వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, కృష్ణారెడ్డి, జైపాల్ నాయక్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లు శిరందాసు కృష్ణయ్య, రాజినేని వెంకటేశ్వర్ రావు, కేసాని లింగారెడ్డి, ఉజ్జిణి విద్యాసాగర్ రావు, రమావత్ లాలు నాయక్, వంగాల ప్రతాప్ రెడ్డి, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, నాయకులు హన్మంతు వెంకటేష్ గౌడ్, గాజు ల ఆంజనేయులు, గోవర్దన్‌రెడ్డి, మాధవరం దేవేందర్ రావు, టివిఎన్ రెడ్డి, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిక
మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో చింతపల్లి మండలానికి మాస భాస్కర్‌తోపాటు పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, కొండమల్లేపల్లి మండలానికి పలువురు మాజీ సర్పంచులు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, అభ్యర్థులను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు.

ఉత్తమ్ కుమార్ గెలిచే అవకాశమే లేదు
- గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ ఎంపీ
దేవరకొండ నియోజకవర్గంతో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. నాపట్ల చూపిన ఆదరాభిమానాలే ఇప్పుడు టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి నర్సింహారెడ్డి పట్ల చూపాలి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యధిక మెజార్టీ ఇవ్వాలి. ఈ సారి కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషిస్తాయి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. 16 ఎంపీ స్థానాలను గెలిపించి కేసీఆర్‌కు అండగా నిలువాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్కసారైన దేవరకొండకు వచ్చిన సందర్భం లేదు. నల్లగొండ స్థానానికి పోటీచేసే అభ్యర్థి లేకనే ఉత్తమ్‌ను విధిలేని పరిస్థితుల్లో నిలబెట్టారు. అందుకే ఉత్తమ్ కుమార్ గెలిచే ప్రసక్తే లేదు.

దేవరకొండ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తాం
- రమావత్ రవీంద్ర కుమార్, దేవరకొండ, ఎమ్మెల్యే
మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 38వేలకు పైగా మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. ఎంపీ ఎలక్షన్లలో ఇంతకంటే ఎక్కువ మెజార్టీ ఇస్తాం. పోలింగ్ రోజు వరకు గ్రామాల్లో, తండాల్లో పర్యటించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తాం. సీఎం కేసీఆర్ దేవరకొండ నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానాన్ని చూపడంతో గడచిన ఐదేండ్ల కాలంలో ఈ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ముందు వరుసలో ఉంచిన టీఆర్‌ఎస్ పార్టీకి ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటరు.

ఆశీర్వదించండి.. మీ వెన్నంటి ఉంటా
- వేమిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి
సీఎం కేసీఆర్ అనతికాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. ఎంపీగా టీఆర్‌ఎస్ పార్టీ తరఫున అవకాశం రావడం పూర్వ జన్మసుకృతం. ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను ఆదరించి ఆశీర్వదించండి. మీ వెన్నంటి ఉండి సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతా.

70వేల మెజార్టీ ఇవ్వాలి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఆరుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నరు. ఉత్తమ్ కుమార్ ఎంపీగా ఇక ఎట్ల గెలుస్తడు. కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్తు లేదనే ఆపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు రాజీనామాలు చేసి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నరు. ఈసారి అందరి దృష్టి నల్లగొండ పార్లమెంట్‌పైనే ఉంది. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో దేవరకొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు 96వేల ఓట్లు వచ్చినై. ఇదే ఊపుతో ఎంపీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 70వేల మెజార్టీ ఇవ్వాలి.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...