ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు


Sun,March 24, 2019 01:22 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందజేసి కొనుగోలు చేపట్టేందుకు అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐకేపీల ద్వారా ఈ కొనుగోళ్లను చేపట్టనుంది. దళారులకు రైతులు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దనే ఉద్దేశంతో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించేందుకు సన్నాహమవుతుంది. జిల్లావ్యాప్తం గా పీఏసీఎస్‌ల ద్వారా 167, ఐకేపీల ద్వారా 151 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉత్పత్తిని బట్టి తొలుతగా అవసరమున్న ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించి తర్వాత జిల్లాఅంతటా విస్తరించనున్నారు.

- 5.87 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా...
జిల్లాలో ఈ యాసంగిలో వరి సాధారణ ఏరియా 70,144 హెక్టార్లకు గాను 90,349 హెక్టార్లలో సాగైంది. అందులో 5,87,269 మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే కొనుగోలు చేయాలని భావించి ముందస్తుగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. గత యాసంగిలో 4.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈసారి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్తుంది. క్వింటాకు ఏ గ్రేడ్ రకం ధాన్యమైతే రూ.1770, సాధారణ రకం ధాన్యమైతే రూ.1750 చెల్లించనున్నారు. గతంలో విధంగానే ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలనే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.


- అత్యధికంగా ఆయకట్టు నుంచే..
జిల్లా వ్యాప్తంగా 5.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలనే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు అందులో 3.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆయకట్టు నుంచే కొనుగోలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 90,349 హెక్టార్లలో 46,965 హెక్టార్లలో ఆయకట్టు పరిధిలోని 10 మండలాల్లోనే సాగైంది. ఇక గతంలో ఆయా మార్కెట్లలో వసతులు, టార్పాలిన్ల సమకూర్పు, ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ యంత్రాల అందజేత, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగేది. ఈసారి ప్రభుత్వం ఈ బాధ్యత సివిల్ సప్లయ్ యంత్రాంగానికి అప్పగించిన నేపథ్యంలో వారే అన్ని మార్కెట్లలో వీటిని సమకూర్చాల్సి ఉంది.అయితే తేమ విషయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. 17 శాతం లోపు తేమ ఉన్నటువంటి ధాన్యానికి మాత్రమే మద్దతు ధర లభిస్తోంది.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...