ఎమ్మెల్సీ పోలింగ్ @ 89.25 శాతం


Sat,March 23, 2019 12:23 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: శాసన మండలి ఉపాధ్యాయ నియోజక వర్గానికి సంబంధించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు ఈ నియోజక వర్గానికి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న పూల రవీందర్ పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల 5 వరకు నామినేషన్లు స్వీకరించింది. ఆ తర్వాత తిరస్కరణ, పరిశీలన, ఉపసంహరణ అనంతరం 9 మంది అభ్యర్థులు బరిలో నిలువగా వారి భవితవ్యాన్ని తేల్చేందుకు ఆయా జిల్లాల్లో శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగగా సాయంత్రానికి 89.25 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను డివిజనల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి జిల్లా కేంద్రంలోని దుప్పలపల్లి గోడౌన్లకు తరలించారు.

89.25 శాతం పోలింగ్ నమోదు ...
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు ఆయా జిల్లాల్లో శుక్రవారం ప్రశాంతంగా జరుగ్గా సాయంత్రానికి 89.25 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా అవిభాజ్య నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో ఉన్న భద్రాద్రి, జనగాం, జయశంకర్‌భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, నల్లగొండ, సిద్దిపేట, వరంగల్‌రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి జిల్లాల పరిధిలో 20,888మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఉదయం 8 గం టల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 18,886 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అత్యధికంగా నల్లగొండ.. అత్యల్పంగా భూపాలపల్లి
నల్లగొండ,ఖమ్మం,వరంగల్ శాసన మండలి నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన అనంతరం 12 జిల్లాలు ఆవిర్భవించగా వాటి పరిధిలో 20,888 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఇందులో 18,886 మంది ఓటు హక్కు వినియోగించుకోగా అత్యధికంగా నల్లగొండ జిల్లాలో, అత్యల్పంగా జయశంకర్‌భూపాలపల్లిలో ఓటింగ్ నమోదైంది. నల్లగొండలో 3859 మంది ఓటర్లకు గాను 3583 మంది (92.85 శాతం) ఓటు హక్కును వినియోగించుకోగా, జయశంకర్‌భూపాలపల్లిలో 162 మంది ఓటర్లకు గాను 136 మంది మాత్రమే వినియోగించుకోవడంతో 83.95 శాతంగా నమోదైంది. ఇక భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, వరంగల్‌రూరల్, అర్బన్ జిల్లాల్లో 90 శాతంలోపు పోలింగ్ శాతం నమోదుకాగా, మిగిలిన జిల్లాల్లో అంతకు మించి నమోదైంది.

పలు జిల్లాల్లో ఓటింగ్ సరళి ఇలా...
అవిభాజ్య నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 12 నూతన జిల్లాలు ఉండగా వాటిల్లో గంటగంటకు ఓటింగ్ శాతం పెరిగింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగ్గా 2 గంటలకోసారి ఎన్నికల రిటర్నింగ్ అదికారులు పోలింగ్ సరళిని విడుదల చేశారు. మొత్తంగా 20,888 మంది ఓటర్లకు గాను ఉదయం 10గంటల వరకు 4793 (21.89 శాతం) మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా మధ్యాహ్నం 12 గంటల వరకు 12,038 (57.87 శాతం) మంది ఓటర్లు 2 గంటల వరకు 16,362 (77.36 శాతం)మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 4గంటల వరకు 18,886 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 89.25 శాతంగా నమోదైంది.

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు...
ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన శాసన మం డలి ఎన్నికలు 12 జిల్లాల్లోనూ ప్రశాంతంగా జరిగాయి. ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ్గా 89.25 శాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోను కలెక్టర్లతో పాటు ఆర్డీఓలు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తూ ఆయా ప్రాంతాల డివిజనల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ముందు రోజే పరిశీలించి ఎన్నికల రోజు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 3 జిల్లాల్లో 185 పోలింగ్ కేంద్రాలను ఓటర్ల వెసులుబాటు నిమి త్తం ఏర్పాటు చేశారు. ఈ నియోజక వర్గానికి మొత్తం 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా స్క్రూట్నీ, ఉపసంహరణ అనంతరం 9 మంది బరిలో ఉన్నారు. ఈ బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రంలోని దుప్పలపల్లి గోడౌన్‌కు తరలించగా ఈ నెల 26న ప్రాధాన్యత రూపంలో కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించనున్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా 30పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సరళి తీరు తెన్నులను అధికారులను అడిగి తెలుసుకుని పటిష్టంగా సాగించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఎన్నికల అధికారులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...