ముగిసిన బ్రహ్మోత్సవాలు


Tue,March 19, 2019 02:45 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : మూలమంత్రాలు..పవిత్ర మంత్రభూతములైన జలము... ఫలరసములు... పంచామృతాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని అభిషేకించే అష్టోత్తరశతఘటాభిషేకం సోమవారం యాదాద్రిలో ఆగమశాస్ర్తానుసారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల దేవుడైన తిరువీధులలో ఊరేగిన యాదాద్రీశుడి ఉత్సవ పరిసమాప్తిగా అభిషేక వేడుక నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కళశములలో పంచామృతాలు, పండ్ల రసాలు, పవిత్ర జలమును ఉంచి ఆయా మంత్రములచే ఆయా దేవతలను ఆహ్వానించి ఆరాధించారు. తీర్థ రాజములతో పంచామృతములతో శ్రీస్వామివారి మూలవరులకు అభిషేకం చేశారు.
108 కలశములతో అభిషేకించడంలో ప్రత్యేకత
108 కలశములతో అభిషేకించుటలో ఎంతో ప్రత్యేకత దాగి ఉంది. ఆగమశాస్ర్తాలు ఈ సంఖ్య నిర్ధిష్టతను వివరించాయి. 25 తత్వములు, 3 గుణములు, 7 వారములు,15 తిథులు, 27 నక్షత్రములు, 4 వేదములు, 3 కాలములు, 12 నెలలు ద్వాదశాధిపత్యులు కలిపి 108గా పేర్కొనబడ్డాయి. భగవానుడి సృష్టిలోని సమస్త జీవజాలం ఈ 108లో అంతర్లీనమై ఉంది. సర్వము భగవత్ సమర్పణ గావించినపుడే పరిపూర్ణత చెందగలదని పంచామృతములు, ప్రకృతిలోని సంపద అంతా అమృతమయము కావాలని...పండ్ల రసములు రస స్వరూపుడైన భగవానునికి నిదర్శనము. పవిత్ర తీర్థములు భగవంతుడి నిజనివాస స్థానములని అవి పవిత్ర కరములు అని భగవత్ సమర్పితములైన వాటిని ప్రకృతి జీవకోటి పొందిన పరమాత్మ ఆనందములు పొందగలదని అంతరార్ధము. ఎంతో విశిష్టత కలిగిన ఈ వేడుక బ్రహ్మోత్సవ వైభవాన్ని పెంచుతుందని భక్తుల విశ్వాసం.
వైభవంగా డోలోత్సవం
శ్రీవారి బాలాలయంలో శ్రీలక్ష్మీనరసింహుల శృంగారడోలోత్సవము సోమవారం రాత్రి కన్నుల పండువుగా అర్చకులు జరిపించారు. ఆలయ అర్చకులు నాదస్వర బృందం, మంగళవాయిద్యముల మధ్య లక్ష్మణాదేవి బృందములచే డోలోత్సవ కీర్తనలు, గంధము పూయరుగా... మొదలగు భక్తి ఆరాధనలచే అత్యంత భక్తి భరితంగా నిర్వహించారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...