సన్నాహం సక్సెస్


Sun,March 17, 2019 02:42 AM

- నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు
-ఏడు నియోజక వర్గాల నుంచి 25వేల మందికిపైగా హాజరు
-ఎంపీ అభ్యర్థికి లక్షల్లో మెజార్టే లక్ష్యంగా నేతల ప్రసంగాలు
-ప్రతి నియోజకవర్గం నుంచి 30వేలకు పైగా మెజార్టీ ఇస్తామన్న ఎమ్మెల్యేలు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘన స్వాగతం
నల్లగొండ, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం విజయవంతమైంది. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ నియోజక వర్గాల నుంచి కార్యకర్తలు అంచనాకు మించి తరలిరావడంతో సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఏడు నియోజక వర్గాల్లోని ఒక్కో నియోజక వర్గం నుంచి 3 వేల మంది కార్యకర్తలను మాత్రమే తరలించాలని ముందస్తుగా లెక్కలు వేసుకున్నప్పటికీ అంతకు మించి హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి పాల్గొనగా.. తమ నియోజకవర్గాల నుంచి 30వేలకు పైగా మెజార్టీ సాధించి నల్లగొండ ఎంపీ అభ్యర్థిని రెండు లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రకటించారు. తొలుత కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన నేతలు ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో ప్రసం గించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

అభ్యర్థి ఎవరైనా రెండు లక్షల పైచిలుకు మెజార్టీ సాధించాలి
నల్లగొండ పార్లమెంట్ నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా రెండు లక్షల పైచిలుకు మెజార్టీ సాధించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలి. నేను 1999లో 80 వేల మెజార్టీతో, 2009లో 1.50 లక్షలు, 2014లో 1.94 లక్షలతో విజయం సాధించిన. ఈ సారి 2 లక్షల పై చిలుకు మెజార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థికి అందించాలి. ఐదేళ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో ఏఎంఆర్‌పీ సొరంగం పనులు వేగవంతం చేయడంతోపాటు సూర్యాపేట, నల్లగొండలో 2 మెడికల్ కళాశాలలు, నల్లగొండలో బత్తాయి మార్కెట్ ఏర్పాటుకు కృషి చేశాను. డిండి, ఎత్తిపోతల, సాగర్‌కు రెండో పంట నీరు, దామరచర్లలో అల్ట్రా పవర్ ప్రాజెక్టు, కోదాడ, కల్వకుర్తి, జాతీయ రహదారి, ఆయకట్టు లిఫ్టు ఇరిగేషన్ల పునరుద్ధరణ లాంటి పనులు చేశాం. రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఏ పనైనా సాధ్యమవుతుంది.
-గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ, నల్లగొండ

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...