నేడే కేటీఆర్ సభ


Sat,March 16, 2019 01:09 AM

- సర్వాంగ సుందరంగా ముస్తాబైన నల్లగొండ

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సాధారణ గెలుపు కాదు.. భారీ మెజారిటీతో ఘన విజయమే లక్ష్యంగా అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నేడు నల్లగొండ పార్లమెంట్ స్థానం సన్నాహక సమావేశం నిర్వహించనుంది. నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో జరగనున్న ఈ సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సుమారు 15వేలకుపైగా కార్యకర్తలు, నాయకులు తరలిరానున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తర్వాత కేటీఆర్ నేడు తొలిసారి జిల్లాకు వస్తుండడంతో ఘనంగా స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ మేరకు మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పరిశీలించారు.
నల్లగొండ పార్లమెంట్ స్థానంలో తమ గెలుపు ఖాయమైందని.. ఆధిక్యమే లక్ష్యంగా తమ పార్టీ శ్రేణులు పని చేయనున్నాయని ధీమాగా చెప్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు నల్లగొండకు వస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో నిర్వహించనున్న నల్లగొండ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండుసార్లు ఉద్యమ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభలకు హాజరైన స్థలంలోనే నేటి సభను సైతం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సభ ప్రారంభంకానుంది.

నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 2 వేల మంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని పార్టీ ఆదేశించినా.. అంతకుమించి రెట్టింపు సంఖ్యలో పార్టీ శ్రేణుల తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. అంచనా కంటే ఎక్కువ మంది వచ్చిన ఎండలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు నుంచే పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలిసారి జిల్లాకు విచ్చేస్తున్న యువ నేత కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. చర్లపల్లి నుంచి సభాస్థలి వరకు భారీ బైక్ ర్యాలీని సైతం నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గురువారమే సభా ఏర్పాట్లను పర్యవేక్షించగా.. శుక్రవారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి సభ ఏర్పాట్లు పరిశీలించారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంట్ స్థానంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్.. నేడు నల్లగొండలో ఘన విజయమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపనున్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...