కుల వృత్తులతోనే పల్లెలకు పునరుజ్జీవం


Sat,February 23, 2019 02:13 AM

- తెలంగాణ ఏర్పాటుతో అట్టడుగు వర్గాలకు లబ్ధి
- ప్రజల బాధలను అర్థం చేసుకునే పలు పథకాల రూపకల్పన
- విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
- బీసీ రుణాల చెక్కులు, మత్స్యకారుల వాహనాల అందజేత
సూర్యాపేట వ్యవసాయం : కుల వృత్తులతోనే పల్లెలకు పునరుజ్జీవం ఉంటుందని సీఎం కేసీఆర్ భావించి ఆయా కుటుంబాల కోసం అనేక పథకాలను రూపొందిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్‌హాల్‌లో మత్స్యకారులకు సబ్సిడీ వాహనాలు, బీసీ కులాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అట్టడుగు వర్గాలకు లబ్ధి చేకూరుతుందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రతి పథకం ప్రజల బాధల నుంచి రూపకల్పన చేసినవేనన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 3లక్షల మందికి పైగా యువతులకు చేయూతనందించినట్లు తెలిపారు. విద్యతోనే పిల్లల జీవితాల్లో వెలుగులు నింపడం సాధ్యమవుతుందని, ఆ ఆలోచనతోనే గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు.

దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలబెట్టాలని సంకల్పించి సీఎం కేసీఆర్ దేశం ఆకర్శించే విధంగా పథకాల రూపకల్పన చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలు సద్వినియోగం చేసుకున్నప్పుడే కేసీఆర్ ఆశయం సిద్ధిస్తుందన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో కులవృత్తుల కుటుంబాల్లో వెలుగులు నింపామన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత మంత్రి జగదీష్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం సూర్యాపేట కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా సుమారు 322మంది లబ్ధిదారులకు చేయూతనందిస్తున్నామన్నారు. మత్స్యశాఖ ద్వారా సుమారు 3కోట్ల 29లక్షల 79వేల రూపాయల వ్యయంతో 37ట్రాలీలు, 67 ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై మత్స్యకారులకు అందిస్తున్నామన్నారు. అంతకుముందు పూలే చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ ఆర్.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మోహన్‌రావు, బీసీ సంక్షేమ అధికారి జ్యోతి, మత్స్యశాఖ అధికారి సౌజన్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు ఈదుల యాదగిరి, రూపేందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

207
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...