పెద్దగట్టు లింగన్నకు నిధుల వరద


Thu,January 24, 2019 02:27 AM

-ఫిబ్రవరి24 నుంచి 28 వరకు జాతర
-అభివృద్ధి, మౌలిక వసతులకు రూ.1.70 కోట్లు మంజూరు
-ఉమ్మడి రాష్ట్రంలో పైసా విదిల్చని వైనం
-మాజీ మంత్రి జగదీష్ చొరవతో జాతరకు గుర్తింపు
సూర్యాపేట ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ప్రతి రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే దురాజ్ పెద్దగట్టు లింగమంతుల జాతర రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదిగా పేరొందింది. సమ్మక్క సారళమ్మ జాతర తరువాత అతిపెద్ద జాతరగా లింగమంతుల స్వామి జాతరకు గత ఉమ్మడి రాష్ట్రంలోనే పేరున్నప్పటికీ నాటి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదు కదా... నయాపైసా మంజూరు చేయలేదు. దీంతో లక్షలాది మంది భక్తులు వచ్చినా వసతుల లేమితో అవస్థలు పడుతూ మొక్కులు తీర్చుకొని పోయేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఈ జాతర రూపురేకలే మారిపోతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2015 ఫిబ్రవరిలో మొదటి జాతర జరుగగా నాటి రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ జాతరను ఘనంగా జరిపేందుకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు రూ.2.10కోట్లతో ప్రతిపాధనలు సిద్ధం చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేయించారు. ఆ వెంటనే గుట్టపై సీసీ పనులు, ఆలయ ఆధునీకరణ, గుట్ట కింద ప్రత్యేక ఆకర్షణగా భారీ కోనేరు, గుట్ట చుట్టూ సీసీరోడ్లు, మెట్లు, రేయిలింగ్, బోర్లు వేయించడం, పైపులైన్లు, విద్యుదీకరణ తదితర అనేక పనులను చేయించడంతో 2015జాతరకు వచ్చిన భక్తులు సౌకర్యాలు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి రెండేళ్ల తరువాత 2017 ఫిబ్రవరిలో జరిగిన జాతరను మరింత వైభవోపేతంగా రూ.1.29కోట్లు మంజూరు చేయించి అలాగే ఎండోన్మెంట్ శాఖ ఆధ్వర్యంలో గుట్టపైన పెండింగ్ ఉన్న సీసీ పనులు, పూజారి క్వార్టర్స్, గెస్ట్ తదితరాలను రూ.54లక్షలతో పనులు చేపట్టారు. బోర్లను శుభ్రం చేయించడం, సబ్ మోటార్లు బిగించడం, పైపులైన్లు వేయడం, గుట్టకింద మరుగుదొడ్ల నిర్మాణాలతోపాటు ఇతరత్రా పనులు చేపట్టారు.
మూడోసారి రూ.1.70కోట్లు
తెలంగాణ ప్రభుత్వం 2014లో ఏర్పాటు కాగా అనంతరం 2015, 2017లలో జరిగిన జాతరలకు వరుసగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా వరుసగా మూడోసారి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జాతరకు నిధులు కావాలని కోరడంతో స్పెషల్ డెవలప్ ఫండ్ నుంచి రూ.1.70కోట్లను సీఎం కేసీఆర్ విడుదల చేయించారు. ఈ నిధులతో రోడ్ల మరమ్మతులు, ట్యాంకుల శుభ్రం చేయడం, అవసరమున్న చోట రేయిలింగ్ ఏర్పాటుతోపాటు పలు శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అలాగే పంచాయతీరాజ్ అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసుశాఖ తదితర శాఖలు తమ అవసరాలు, సదుపాయాల కోసం కొన్ని శాశ్వత కొన్ని తాత్కాలిక పనులు చేపట్టారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరుగుతున్న పెద్దగట్టు జాతరకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు అవుతుండడం... అదేస్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతుండడం పట్ల ప్రధానంగా యాదవులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...